Mana Enadu : కల్తీ పాలు.. కల్తీ నెయ్యి.. కల్తీ ఆహారం.. పిల్లలు తినే ఐస్ క్రీమ్ (Adultrated Ice Creams) ల నుంచి పెద్దలు తినే బిర్యానీ వరకు ప్రస్తుతం దేశంలో అందరినీ వణికిస్తోంది ఆహార కల్తీ. ఇది ప్రజారోగ్యానికి పెను సవాలు విసురుతోంది. నిత్యం ఉపయోగించే ఆహార పదార్థాలను కల్తీ చేస్తూ కొంతమంది దుర్మార్గులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇటీవల మార్కెట్ లో కల్తీ పసుపు(Adulterated Turmeric) వెలుగులోకి రావడం ప్రజలను తీవ్రంగా కలవరం పెడుతోంది. మరి మీరు ఉపయోగిస్తున్న పసుపు స్వచ్ఛమైందో లేదో తెలుసుకోవాలంటే ఈ టిప్స్ పాటిస్తే సరిపోతుంది.
కల్తీ పసుపు ఇలా గుర్తించండి
మీరు వాడుతున్న పసుపు కల్తీదో కాదో గుర్తించేందుకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ఓ చిన్న ప్రయోగం చేస్తూ ఓ వీడియో రూపొందించింది. ఈ వీడియోలో.. కల్తీ పసుపు(Kalthi Pasupu)ను గుర్తించేందుకు రెండు గ్లాసుల నీటిలో ఓ టేబుల్ స్పూను పసుపు వేయాలి. అది స్వచ్ఛమైనది అయితే నీరంతా లేత పసుపు రంగులోకి మారి పసుపు గ్లాసు అడుగుకు చేరుకుంటుంది. కల్తీదయితే గ్లాసులోని నీరు చిక్కటి పసుపు రంగులోకి మారుతుంది.
ఇవి స్వచ్ఛమైన పసుపు కొమ్ములేనా?
పసుపు కొనుగోలు చేస్తే మార్కెట్లో కల్తీది విక్రయిస్తున్నారని భావించి.. పసుపు కొమ్ములే(Turmeric Cones) కొంటే ఈ సమస్య ఉండదని కొందరు పసుపు కొమ్ములు పట్టించి వాడుతుంటారు. అయితే ఇవి కూడా కల్తీ అవుతున్నాయట. మరి పసుపు కొమ్ములు కల్తీవా కావా అని గుర్తించేందుకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ మరో వీడియో రూపొందించింది. నకిలీ పసుపు కొమ్ములని గుర్తించడానికి రెండు గ్లాసుల నీటిలో రెండు పసుపు కొమ్ములు వేయాలి. స్వచ్ఛమైన పసుపు కొమ్ములున్న గ్లాసులోని నీరు రంగు మారదు. నకిలీ కొమ్ములున్న గ్లాసులోని రంగు మారుతుంది.
మరికొన్ని చిట్కాలు
- అసలైన పసుపుకు ప్రత్యేకమైన సువాసన ఉంటుంది. కల్తీ పసుపునకు స్మెల్ ఉండదు.
- నాణ్యమైన పసుపును చేతిలోకి తీసుకున్నప్పుడు మృదువుగా, మెత్తగా ఉంటుంది. కల్తీ పసుపు కొద్దిగా గరుకుగా లేదా ముద్దగా ఉంటుంది.