Mana Enadu : వినాయక చవితి (Vinayaka Chaviti) నవరాత్రి ఉత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈనెల 7వ తేదీన బొజ్జ గణపయ్యను మండపాలకు తీసుకొచ్చి కొలువుదీర్చిన భక్తజనం ప్రతిరోజూ ప్రత్యేక పూజలు చేస్తూ గణపయ్యను కొలుస్తున్నారు. ఇక నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈనెల 17వ తేదీన గణేశ్ నిమజ్జనం (Ganesh Nimajjanam) జరగనుంది. ఇప్పటికే నిమజ్జనానికి అన్ని జిల్లాల్లో అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈనెల 17 ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం
మరోవైపు హైదరాబాద్లో ఇప్పటికే గణేశ్ నిమజ్జనం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రాంతాల వారీగా ఐదో రోజు నుంచి వినాయకుడి నిమజ్జనం జరుగుతోంది. మరోవైపు రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఖైరతాబాద్ మహాగణపతి (Khairatabad Maha Ganapati) కూడా నిమజ్జనానికి సిద్ధం అవుతున్నాడు. ఈనెల 17వ తేదీన ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర జరగనుంది. ఊరేగింపుగా వెళ్లి గణపయ్య గంగమ్మ ఒడిలో చేరనున్నాడు.
భక్తజన సంద్రంగా ఖైరతాబాద్
ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ గణేశుడి (Khairatabad Ganesh) దర్శనానికి ఇవాళ ఒక్కరోజే అవకాశం ఉంది. మరోవైపు వరుసగా సెలవులు రావడంతో భక్తులు ఖైరతాబాద్ గణపయ్యను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. ఇవాళ గణపయ్య చెంత భక్తుల రద్దీ భారీగా పెరిగింది. మరోవైపు నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఖైరతాబాద్కు భక్తులు తరలివస్తుండటంతో ఈ ప్రాంతంలోని మెట్రో స్టేషన్ (Metro Station) కిక్కిరిసి పోయింది.
పోలీసుల భారీ బందోబస్తు
ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. భక్తులు త్వరగా వినాయకుడిని దర్శనం చేసుకునేలా చూస్తున్నారు. సోమవారం రోజున భక్తుల దర్శనాలకు అనుమతులు నిలిపివేసి నిమజ్జనానికి (Khairatabad Ganesh Immersion) నిర్వాహకులు ఏర్పాట్లు చేయనున్నారు. ఈ నేపథ్యంలో లంబోదరుడి దర్శనానికి ఈరోజు చివరి రోజు కావడంతో భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తుతున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు, భాగ్యనగర ఉత్సవ సమితి సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు.
ఖైరతాబాద్ గణేశుడికి హరీశ్ రావు పూజలు
మరోవైపు ఖైరతాబాద్ గణేశుడిని సామాన్య భక్తులతో పాటు వీఐపీలు కూడా ఇవాళ దర్శించుకుంటున్నారు. ఇప్పటికే బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. తాజాగా మాజీ మంత్రులు హరీశ్ రావు (Harish Rao), తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా స్వామి వారిని దర్శించుకున్నారు. అంతకుముందు గణేశ్ ఉత్సవ సమితి నిర్వాహకులు హరీశ్‌రావుకు ఘన స్వాగతం పలికారు.