Mana Enadu : ఇప్పటికే కూరగాయల ధరల (Vegetables) పెరుగుదలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇక ఉరుము ఉరుమి మంగళం మీద పడినట్లు కూరగాయల ధరలు చేసిన గాయం నుంచి తేరుకోకముందే కేంద్ర సర్కార్ సామాన్యులకు పిడుగులాంటి వార్త చెప్పింది. వంటనూనెలపై దిగుమతి సుంకం పెంచుతున్నట్లు మోదీ సర్కార్ చేసిన ప్రకటనతో నూనెల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటుతున్నాయి.
సామాన్యులపై పెనుభారం
కేంద్రం (Central Govt) ప్రకటన సామాన్యులపై పెను భారం మోపింది. మొన్నటి దాక సాధారణంగా ఉన్న వంటనూనెల (Cooking Oils) ధరలు ఒక్కసారిగా రూ.20 వరకు పెరగడంతో మధ్యతరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. లీటరు వంటనూనెపై రూ.15 నుంచి రూ.20 వరకు పెంచడంతో సామాన్యులు లబోదిబోమంటున్నారు. శనివారం ఉదయం లీటరుకు రూ.115గా ఉన్న సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర, సాయంత్రానికి రూ.130కి చేరింది. ఇక పామోలిన్ ధర లీటరు రూ.115కు పెరిగింది.
ఆన్‌లైన్‌నూ అమాంతం పెంచేశారు..
ముడి పామోలిన్ (Palm Oil), సోయా, పొద్దు తిరుగుడుపై సుంకం విధిస్తున్నట్లు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ప్రకటనతో వ్యాపారులు ఒక్కసారిగా నూనెల ధరలు పెంచేశాయి. వంటనూనెలతో పాటు పూజకు ఉపయోగించే నూనె ధరలు కూడా లీటరుకు రూ.15కు పైగా పెంచారు. దుకాణాల్లోనే కాదు ఆన్‌లైన్ విక్రయ సంస్థలు కూడా ధరల్ని పెంచాయి.
ధరల పెరుగుదలతో వినియోగదారుల్లో ఆందోళన
వంట నూనెల ధరల పెంపు (Edible Oil Prices Hike 2024) తో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. నిల్వ ఉన్న సరకుపైనా ధరలు పెంచడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్లో మరింత పెరుగుతాయనే ఆందోళనతో సామాన్యుల పరిస్థితి ఏంటని వాపోతున్నారు. మరోవైపు ప్రధాన కంపెనీల నుంచి మూడు రోజులుగా లోడింగ్ కూడా నిలిచిపోయిందని వ్యాపారులు చెబుతున్నారు.
ఒక్కసారిగా పెరిగిన ధరలు
ఇక పామోలిన్ ఆయిల్‌ను హోల్‌సేల్‌లో లీటరు రూ.110 అమ్ముతుండగా చిల్లరగా దుకాణాల్లో రూ.115 చొప్పున విక్రయిస్తున్నారు. సన్‌ఫ్లవర్ ఆయిల్ (SunFlower Oil Price) ధర కొన్ని దుకాణాల్లో రూ.140కి చేరింది. పూజలకు ఉపయోగించే నూనెల లీటరు ధర మొన్నటి వరకు రూ.109 వరకు ఉండగా.. ప్రస్తుతం రూ.120 పలుకుతున్నాయి.