దేశంలోనే ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్ కోల్కతాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (IIM-Calcutta)లో దారుణం జరిగింది. ఓ విద్యార్థినిపై అక్కడే చదువుతున్న ఓ విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. తాను మానసికంగా సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కాలేజీలో చదువుతున్న ఓ విద్యార్థి తనకు కౌన్సెలింగ్ ఇస్తానని చెప్పి పిలిపింపుచుకొని కూల్ డ్రింగ్లో మత్తుమందు కలిపి దారుణానికి తెగబడినట్లు బాధితురాలు వాపోయింది.
ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయి
‘కౌన్సెలింగ్ ఇస్తానని శుక్రవారం బాయ్స్ హాస్టల్కు పిలిపించుకున్నాడు. అక్కడికి వెళ్లిన తర్వాత కూల్డ్రింక్ ఇస్తే తాగాను. ఏం జరిగిందో తెలుసుకునేలోపే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాను. స్పృహలోకి వచ్చిన తర్వాత నాపై అత్యాచారం జరిగినట్లు గ్రహించాను. ఈ విషయంపై అతడిని ప్రశ్నించగా.. అత్యాచారం గురించి ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించాడు’ అని పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్లో బాధిత యువతి పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న హరిదేవ్పూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సదరు విద్యార్థిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
కోల్కతాలో వరుస అత్యాచార ఘటనలు
కోల్కతాలో నిత్యం అత్యాచార ఘటనలు వెలుగుచూస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం ఓ జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఇటీవల ఓ న్యాయ కళాశాలకు చెందిన విద్యార్థినిపై కాలేజీ ప్రాంగణంలోనే కొందరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలు మరవకముందే ఐఐఎంలో విద్యార్థినిపై అత్యాచార ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది.






