ఇలియానా మరోసారి తల్లి కాబోతున్నాననే శుభవార్తను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇటీవలే ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటోలో గర్భవతిగా ఉన్న తన స్నేహితురాలితో కలిసి నవ్వుతూ, ఇద్దరూ తమ బేబీ బంప్‌లను ప్రదర్శిస్తున్నారు. ఆ ఫోటోకు “బంప్ బడ్డీస్” అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసింది.
ఇలియానా 2023లో మైఖేల్ డోలన్‌ను వివాహం చేసుకుంది. అయితే కొన్ని నెలల పాటు ఆమె వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచింది. అదే ఏడాది ఏప్రిల్‌లో తన మొదటి ప్రెగ్నెన్సీ గురించి చెప్పగా.. ఆగస్టులో కుమారుడు కోవా ఫోనిక్స్ డోలన్‌కు జన్మనిచ్చిన అనంతరం, మైఖేల్ ఫుల్ ఫోటోను ఫస్ట్ టైం పబ్లిక్‌గా షేర్ చేసింది. ప్రస్తుతం ఆమె తన రెండో బిడ్డ రాక కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఈ ఆనందకర విషయాన్ని తెలుసుకున్న అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇలియానా దేవదాసు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమాతో ఇలియానా టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. ఆ తర్వాత పోకిరి, రాఖీ, మున్నా, ఆట, జల్సా, కిక్ వంటి హిట్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళ చిత్రాల్లో స్టార్‌గా ఎదుగుతున్న సమయంలో, హిందీలో బర్ఫీ అనే సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకోవడంతో, ఆమె హిందీ చిత్రాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభించింది. ఇలియానా చివరిసారిగా హిందీలో వచ్చిన రొమాంటిక్ కామెడీ చిత్రం దో ఔర్ దో ప్యార్లో నటించింది. ఈ సినిమాలో విద్యాబాలన్, ప్రతీక్ గాంధీ, సెంధిల్ రామమూర్తి వంటి ప్రముఖులు ముఖ్య పాత్రలు పోషించారు.






