ఇంగ్లండ్(England) గడ్డపై తొలిసారి T20 టైటిల్ నెగ్గి జోరుమీదున్న భారత మహిళల(India Womens) క్రికెట్ జట్టు అదే గడ్డపై మరో సమరానికి సిద్ధమైంది. ఇంగ్లండ్ ఉమెన్స్ టీమ్‌తో మూడు మ్యాచుల వన్డే సిరీస్(ODI Series) ఈరోజు ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆ జట్టుతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-2 తేడాతో గెలుచుకున్న భారత జట్టు, ఈ విజయోత్సాహంతో వన్డే సిరీస్‌లోనూ ఆధిపత్యం చెలాయించాలని భావిస్తోంది. ఈ మేరకు సౌథాంప్టన్(Southampton) వేదికగా జరిగే ఈ తొలి వన్డే కోసం ఇరు జట్లు సిద్ధమయ్యాయి. కాగా, ఈ ఏడాది చివర్లో భారత్‌లో జరగనున్న మహిళల వన్డే వరల్డ్ కప్(Women’s ODI World Cup-2025)కు కీలకమైన సన్నాహకంగా ఇరు జట్లు భావిస్తున్నాయి.

బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలంగా హర్మన్ సేన
హర్మన్‌ప్రీత్ కౌర్(Harmanpreet Kaur) నాయకత్వంలోని భారత జట్టులో స్మృతి మంధాన(Smriti Mandhana), ప్రతికా రావల్, రిచా ఘోష్, జెమిమా రోడ్రిగ్స్(Jemima Rodrigues) వంటి బ్యాటర్లతో బ్యాటింగ్ ఆర్డర్ బలంగా కనిపిస్తోంది. టీ20 సిరీస్‌లో 221 పరుగులతో అద్భుత ప్రదర్శన చేసిన మంధాన, ఈ సిరీస్‌లోనూ అదే ఫామ్‌ను కొనసాగించాలని చూస్తోంది. అయితే, టీటాస్ సాధు, రేణుక సింగ్, పూజా వస్త్రాకర్‌ల గైర్హాజరీలో బౌలింగ్ బాధ్యతను అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్‌లు తీసుకోనున్నారు. స్పిన్ విభాగంలో దీప్తి శర్మ(Deepti Sharma), స్నేహ్ రాణా కీలక పాత్ర పోషించనున్నారు.
ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్న ఇంగ్లండ్
మరోవైపు, నటాలీ సివర్-బ్రంట్(Natalie Siever-Brunt) నాయకత్వంలోని ఇంగ్లండ్ జట్టు, సోఫీ ఎక్లెస్టన్, లారెన్ బెల్ వంటి స్టార్ బౌలర్లతో బలంగా కనిపిస్తోంది. టీ20 సిరీస్‌లో ఓటమి పాలైన ఇంగ్లండ్, ఈ సిరీస్‌లో పుంజుకోవాలని ఆశిస్తోంది. 2022లో భారత్‌పై 0-3 తేడాతో ఓడిన ఇంగ్లండ్, ఈ సారి ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. కాగా ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభమవుతుంది. సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో లైవ్ టెలికాస్ట్, సోనీ లివ్, ఫ్యాన్‌కోడ్ యాప్‌లలో స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది. ఈ మ్యాచ్ రెండు జట్లకూ వరల్డ్ కప్ సన్నాహకంలో కీలకమైనది కావడంతో, ఉత్కంఠభరిత పోరు ఖాయం.







