Mana Enadu : గతేడాది అక్టోబరు 7వ తేదీన ఇజ్రాయెల్(Israel) పై విజృంభించి వందల మంది ప్రాణాలు తీసి.. వందల మంది బంధీకి కారణమైన.. ఇజ్రాయెల్ పై దాడులకు సూత్రధారి అయిన హమాస్ మిలిటెంట్ గ్రూపు అధినేత యాహ్యా సిన్వర్(yahya Sinwar) హతమయ్యారు. సిన్వర్ ను హతమార్చడంతో గాజాతో యుద్ధంలో ఇజ్రాయెల్ అతిపెద్ద విజయం సాధించినట్లైంది. డీఎన్ఏ పరీక్షలో మృతి చెందింది సిన్వరేనని తేలిందని.. ఇజ్రాయెల్ విదేశాంగమంత్రి కాంట్జ్ ధ్రువీకరించారు.
ఇది సైనిక.. నైతిక విజయం
“ఇది ఇజ్రాయెల్‌కు సైనికంగా, నైతికంగా ఘనవిజయం. ఇరాన్ (Iran) నేతృత్వంలో రాడికల్ ఇస్లాం దుష్టశక్తులకు వ్యతిరేకంగా స్వేచ్ఛా ప్రపంచం సాధించిన విజయమిది. సిన్వర్ ఏరివేతతో తక్షణ కాల్పుల విరమణకు, బందీల విడుదలకు మార్గం సుగమం కానుంది. సిన్వర్‌ను హతమార్చి, లెక్కను సరిచేశాం. అయినా ఈ యుద్ధం మాత్రం ఆగదు. బందీలను సురక్షితంగా తీసుకురావడమే మా ధ్యేయం. ఇక గాజాను హమాస్(Hamas) నియంత్రించలేదు.” అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Nethanyahu) ప్రకటించారు.
హమాస్ నుంచి స్పందన లేదు
మరోవైపు తమ నాయకుడి మరణంపై హమాస్ ఇంకా స్పందించలేదు. కీలక నేతలంతా హతమైన వేళ సిన్వర్ మృతి హమాస్‌కు భారీ దెబ్బేనని విశ్లేషకులు అంటున్నారు. ఇక దక్షిణ గాజాలో బుధవారం రోజున ముగ్గురు హమాస్ మిలిటెంట్లను ఇజ్రాయెల్ సైన్యం (IDF) హత మార్చింది. ఇందులో ఓ వ్యక్తికి సిన్వర్ పోలికలు ఉన్నాయని గుర్తించిన ఐడీఎఫ్.. DNA, దంత నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపడంతో హమాస్ నేత మరణాన్ని ధ్రువీకరించింది.
ట్రైనీ సైనికుల సంచలన ఆపరేషన్
అక్టోబర్ 7 దాడులకు సూత్రధారి అయిన సిన్వర్ కోసం ఏడాదిగా గాజా (Gaza) సొరంగాల్లో ఐడీఎఫ్ వేట కొనసాగిస్తోంది. చాలాసార్లు చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నట్లు సమాచారం. ఇక హమాస్‌పై కీలక విజయం సాధించిన సైనికులకు ఇజ్రాయెల్ రక్షణశాఖ మంత్రి యోవ్ గ్యాలంట్ సెల్యూట్ చేశారు. సిన్వర్ మృతితో గాజా వాసులకు స్పష్టమైన సందేశం వెళ్లిందని అన్నారు. ఇజ్రాయెల్ సైనికులు, డ్రోన్లు, నిఘావర్గాలు ఏడాదిగా యత్నించినా సిన్వర్ ఆచూకీ కనిపెట్టలేకపోయారు. అయితే ఇజ్రాయెల్ ట్రైనీ సైనికులు సిన్వర్‌ను మట్టుబెట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది.
Yahya Sinwar lived and died as a warrior. Facing down the Israeli drone in his last moment, threw a stick at it with his final strength. pic.twitter.com/eIesUx2BT4
— Hannah Kim (@K72792215Kim) October 18, 2024