Mana Enadu : బ్రిటన్ రాజు కింగ్ ఛార్లెస్-3(King Charles 3)కు ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో అనుకోని షాక్ ఎదురైంది. ఆ దేశానికి అధికారికంగా పాలకుడైన ఆయన సోమవారం పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగించగా.. ఆయన ప్రసంగం పూర్తైన వెంటనే స్థానిక ఆదివాసీ సెనెటర్ లిడియా థోర్పే (Lidia Thorpe) రాచరికానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘‘ఇది మీ భూమి కాదు.. మీరు మా రాజూ కాదు. ఆస్ట్రేలియా ఆదివాసీలపై ఐరోపా వలసదారులు నరమేధానికి పాల్పడ్డారు. మా భూమిని తిరిగి ఇచ్చేయండి. మా నుంచి దోచుకొన్నవి మొత్తం వాపస్ ఇవ్వండి.’’ అని దాదాపు నిమిషం పాటు గట్టిగట్టిగా కేకలు వేశారు థోర్పే. వలస విధానాన్ని థోర్పే ఎప్పుడూ వ్యతిరేకిస్తారని ఆస్ట్రేలియాలో ఆమెకు పేరుంది.
ఆమె వలస రాజ్య పాలకురాలు
2022లో థోర్పే (Australian Senator Thorpe) ప్రమాణ స్వీకార సమయంలో కూడా వలస రాజ్య పాలకురాలంటూ క్వీన్ ఎలిజిబెత్-2ను అభివర్ణిస్తూ ప్రమాణ స్వీకారం చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. ఆ సమయంలో నాటి ఛాంబర్ ప్రెసిడెంట్ సు లిన్స్ ఆమెను ఉద్దేశించి ‘‘సెనెటర్ థోర్పే.. మీరు ప్రమాణస్వీకారం కార్డులో ప్రచురించిన అంశాన్ని మాత్రమే చదవాలి’’ అని సరి చేశారు.
9 రోజుల పర్యటనలో కింగ్ ఛార్లెస్-3
దాదాపు 100 ఏళ్లకు పైగా బ్రిటన్ వలస రాజ్యంగా ఉన్న ఆస్ట్రేలియా(Australia)లో వేల మంది ఆదివాసీ ఆస్ట్రేలియన్లు హత్యలకు గురయ్యారు. ఆ తర్వాత 1901లో ఆ దేశం అప్రకటిత స్వాతంత్య్రం సాధించినా పూర్తిస్థాయి రిపబ్లిక్‌గా ఏర్పడలేదు. ప్రస్తుతం దానికి కింగ్ ఛార్లెస్-2 రాజుగా వ్యవహరిస్తుండగా.. తాజాగా ఆయన ఆస్ట్రేలియా, సమవో దేశాల్లో తొమ్మిది రోజుల పర్యటనకు వెళ్లారు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా పార్లమెంటులో ప్రసంగించారు.