ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2 (Pushpa 2)’ సినిమా రూ.1800 కోట్ల వసూళ్లతో రికార్డు క్రియేట్ చేసింది. ఇక విక్టరీ వెంకటేశ్ నటించిన ‘సంక్రాంతి వస్తున్నాం (Sankranthiki Vasthunam)’ సినిమా ఇప్పటి వరకు రూ.200 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించింది. ఇలా పలు నిర్మాణ సంస్థలు తమ సినిమా సాధించిన వసూళ్ల లెక్కలను బహిరంగంగా ప్రకటిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు స్పెషల్ పోస్టర్లు రిలీజ్ చేయడం పరిపాటైంది.
ప్రొడ్యూసర్ల ప్లాన్ అదే
అయితే ఈ కలెక్షన్లు చూసి వావ్ ఇన్ని కలెక్షన్లా.. ఆ సినిమా అంత బాగుందా.. మనమూ చూద్దాం అంటూ కొందరు.. అన్ని వసూళ్లొచ్చాయంటే.. ఆ మూవీలో ఏముందో చూడాల్సిందేనని మరికొందరు థియేటర్లకు వెళ్తుంటారు. ప్రేక్షకులను ఇలా థియేటర్లకు తీసుకురావడమే నిర్మాతల టార్గెట్. సినిమా కలెక్షన్లను బహిరంగంగా ప్రకటించడం వెనుక ఉన్న నిర్మాతల ప్లాన్ కూడా ఇదే.
కలెక్షన్లు తెచ్చిన తంటా
అయితే ఇప్పుడు ఇదే ప్లాన్ బెడిసికొట్టినట్లు కనిపిస్తోంది. తమ సినిమాలు కోట్ల కలెక్షన్లు సాధించాయంటూ నిర్మాతలు డప్పు కొట్టుకోవడం ఇప్పుడు వారికి తలనొప్పులు తెచ్చిపెట్టింది. ఎందుకంటే ఈ కలెక్షన్ల వల్లే ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. గత మూడ్రోజులుగా హైదరాబాద్ లో పలు తెలుగు నిర్మాతలు, సినీ నిర్మాణ సంస్థలపై జరుగుతున్న ఐటీ దాడులు చూస్తుంటే ఇది నిజమేనని అనిపించకమానదు.
నిర్మాతలపై ఐటీ పంజా
హైదరాబాద్ లో మూడ్రోజులుగా ఐటీ అధికారులు దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే రెండ్రోజులుగా ప్రముఖ నిర్మాత, ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు, ఆయన సోదరుడు శిరీష్, కుమార్తె హన్సితా రెడ్డి, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ, మరోవైపు పుష్ప-2 ప్రొడ్యూసర్స్ నవీన్, అభిషేక్, రవిశంకర్, మైత్రీ మూవీ మేకర్స్ కంపెనీ కార్యాలయాలు, ఇళ్లల్లో సోదాలు జరుగుతున్న విషయం తెలిసిందే.
మూడోరోజూ సోదాలు
అయితే ఈ నిర్మాతలు, వారి భాగస్వాములు, బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లో మూడోరోజు కూడా ఏటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురు నిర్మాతల ఇళ్లలో సోదాలు చేసిన అధికారులు పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఆదాయం, పన్ను చెల్లింపుల మధ్య పొంతన లేకపోవడంతోనే ఈ తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఈ నిర్మాతల బ్యాంకు లాకర్లను కూడా ఐటీ అధికారులు తనిఖీ చేసినట్లు తెలిసింది.






