
తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత(Jayalalitha) అక్రమ ఆస్తుల కేసు(disproportionate assets)లో స్వాధీనం చేసుకున్న వస్తువులను అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించారు. కోర్టు ఆదేశం మేరకు జరిగిన ఈ బదిలీ దశాబ్దాల పాటు సాగిన న్యాయ పోరాటంలో ఒక ముఖ్యమైన పరిణామంగా నిలవనుంది. ఆదాయానికి మించి ఆస్తులకు సంబంధించిన కేసు 2004లో తమిళనాడు(Tamilnadu) నుంచి కర్ణాటక(Karnataka)కు బదిలీ అయింది. ఈ క్రమంలో అక్కడ జప్తు చేసిన ఆస్తులు, పత్రాలను కర్ణాటకకు తరలించి బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఇప్పటి వరకు భద్రపరిచారు. జప్తు చేసిన సమయంలో ఈ ఆస్తుల విలువ రూ. 913.14 కోట్లుగా అధికారులు అంచనా వేయగా, ఇప్పుడు కనీసం రూ.4 వేల కోట్లుగా ఉండొచ్చని సమాచారం.
మొత్తం ఆరు ట్రంకు పెట్టెల్లో..
తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించిన వాటిలో 10 వేల చీరలు, 750 జతల పాదరక్షలు, 27 కిలోల బంగారం(Gold), వజ్రాభరణాలు, రత్నాలు, 601 కిలోల వెండి(Silver) వస్తువులు, 1,672 ఎకరాల వ్యవసాయ భూమికి సంబంధించిన పత్రాలు, నివాసాలకు సంబంధించిన దస్తావేజులు, 8,376 పుస్తకాలు ఉన్నాయి. వీటిని భారీ భద్రత మధ్య 6 ట్రంకు పెట్టెల్లో తరలించారు. న్యాయమూర్తి HN మోహన్ సమక్షంలో వాటిని అధికారులకు అధికారికంగా అప్పగించారు. కాగా తమిళనాడు అధికారులు డాక్యుమెంటేషన్ ప్రక్రియలో భాగంగా మొత్తం ప్రక్రియను వీడియోలో రికార్డ్ చేశారు.