Mana Enadu : టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ(Prashant Varma).. ఈ ఏడాది ‘హనుమాన్(Hanu Man)’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. యంగ్ నటుడు తేజ సజ్జ ఈ చిత్రంలో హీరోగా నటించాడు. అమృత అయ్యర్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ మూవీ ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తొలి చిత్రంగా నిలిచింది. ఇక ప్రపంచవ్యాప్తంగా రూ.250 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి కలెక్షన్ల సునామీ సృష్టించింది.
హనుమంతుడి పాత్రపై ఆసక్తి
ఈ సినిమా తర్వాత ప్రశాంత్ వర్మ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఈ సినిమాకు సీక్వెల్ గా.. ‘జై హనుమాన్(Jai Hanuman)’ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాలో హనుమంతుడి పాత్రలో కనిపించబోయే నటుడిపై చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. సినిమాకే కీలకమైన ఈ పాత్రలో నటించబోయేది ఎవరని సినీ ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.
ఆంజనేయుడిగా కన్నడ స్టార్
అయితే ఈ మూవీలో హనుమంతుడిగా టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి(Rana Daggubati) నటించనున్నాడని మొదట్లో వార్తలొచ్చాయి. ఆ తర్వాత ప్రశాంత్ వర్మ బాలీవుడ్ నటులను సంప్రదించారన్న వార్తలతో బీ టౌన్ హీరో నటిస్తారనే న్యూస్ వైరల్ అయింది. అయితే తాజాగా సోషల్ మీడియాలో మరో క్రేజీ అప్డేట్ వైరల్ అవుతోంది. ఆంజనేయుడి పాత్రకు ప్రశాంత్ వర్మ కన్నడ స్టార్ హీరోను తీసుకున్నట్లు వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
కాంతార ప్రీక్వెల్ పనిలో రిషబ్
కాంతార సినిమాతో కన్నడ సినిమా స్థాయిని పెంచేసిన నటుడు రిషభ్ శెట్టి గురించి తెలియని వారుండరు. ఇప్పుడు జై హనుమాన్ మూవీలో హనుమంతుడి పాత్రలో రిషబ్ శెట్టి(Rishab Shetty) నటించబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. రిషబ్ ప్రస్తుతం కాంతార ప్రీక్వెల్ మూవీని తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నటుడైతే హనుమంతుడి పాత్రకు సరిగ్గా సరిపోతాడని ప్రశాంత్ వర్మ భావిస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.






