సంక్రాంతి సంబరాలు(Sankranti Celebrations) తొలి రెండు రోజులు అత్యంత సందడిగా జరిగాయి. తొలి రోజు భోగి(Bhogi), రెండో రోజు సంక్రాంతి(Sankranti) పండగను ప్రజలు తమతమ సొంతూళ్లలో సంతోషంగా జరుపుకున్నారు. ఇక ఇవాళ కనుమ(Kanuma) పండగ. ముఖ్యంగా ఈ పండగ రైతన్నలు జరుపుకునే పండుగగా చెప్పుకుంటారు. సంక్రాంతి సంబరంలో చివరి రోజైన కనుమను పశువుల పండుగ అంటారు. పంటలు పండి పంట చేతికొచ్చి సంబరంలో ఉన్న రైతన్న(Farmers)కు ఎంతో గొప్ప నేస్తాలు పశువులు(Cattle). పశువులు సంవత్సరం అంతా తమకు ఎంతో సహాయంగా ఉంటున్నందుకు కృతజ్ఞత చెప్పుకునే పండుగగా ఈ కనుమ లేదా పశువుల పండుగలో అంతరార్థం.
ఈ రోజు తిరుగు ప్రయాణం చేయరు.. ఎందుకంటే
వ్యవసాయం(Agriculture)లో పశువుల ప్రాముఖ్యత చాలా కీలకమైనది. కనుమ పండుగ రోజు ఉదయాన్నే పశువులను శుభ్రంగా కడిగి వాటికి పసుపు కుంకుమ పెట్టి, మెడలో గజ్జెల పట్టీ, కాళ్లకు మువ్వలు వేస్తారు. ఏడాది మొత్తం రైతులకు సహాయపడుతూ ఎండనక, వాననక కష్టపడే పశువులకు ఏడాదిలో ఒక్కసారి కనుమ పండుగ రోజు పూర్తి విశ్రాంతి కల్పిస్తారు. పిండి వంటలతో సంక్రాంతి మంచి విందును ఇస్తే, కనుమ పండుగ మసాలా ఘుమఘుమలతో మైమరపిస్తుంది. ఇక కనుమ రోజు కాకులు కూడా ఎక్కడికీ కదలవని ఓ నానుడి. అందుకే పండక్కి వచ్చిన వారు కనుమ రోజు తిరుగు ప్రయాణం చేయరాదని మన పూర్వీకులు అంటారు. కనీసం ఊరి పొలిమేర కూడా దాటకూడదని అంటారు.

పంటలు సమృద్ధిగా పండాలని..
ఇక కనుమ రోజు గంగిరెద్దుల(Gangireddula) వారు విశేషంగా ఇంటింటికీ తిరుగుతూ గంగిరెద్దు చేత అందరికీ ఆశీర్వాదాలు(Blessings) ఇప్పిస్తూ వారి నుంచి బియ్యం, వస్త్రాలు వంటివి సేకరిస్తారు. కనుమ రోజున రైతులు తమ పొలంలోనే పొంగళ్లు వండి భూలక్ష్మికి నివేదన చేసిన తరువాత ఆ పొంగళ్లను తమ పంట పొలంలో చల్లుతారు. ఆ విధంగా చేయడం వలన కొత్త సంవత్సరం(New Year)లో కూడా పంటలు(Crops) సమృద్ధిగా పండుతాయని విశ్వాసం. ఇక ఈరోజు తెలుగు సంప్రదాయాలలో రథం ముగ్గు(Ratham Muggu) వేయడం చాలా ప్రత్యేకమైన ఆచారం. ఈ ముగ్గు వేయడం వెనుక లోతైన ఆధ్యాత్మిక, సాంస్కృతిక అర్థాలు దాగి ఉన్నాయి. రథం ముగ్గును సూర్య భగవానుడి రథంగా భావిస్తారు. సూర్యుడు(SUN) అన్ని ప్రాణులకు జీవనాధారం. అందుకే ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి ఈ ముగ్గును వేస్తారని మహిళల విశ్వాసం.







