-అరణ్య
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హడావుడి మొదలైంది. ఏడాది ముందు నుంచే అధికార భారాస ప్రచారాలు ముమ్మరం చేయగా, కాస్త ఆలస్యంగా భాజపా, ఈ ఇద్దరి దూకుడు అందుకునేందుకు హస్తం ఎన్ని ప్రయత్నాలు చేసినా.. పొలిటికల్ బ్లఫ్ మాస్టర్ కేసీఆర్ ముందు తేలిపోతున్నట్టే కనిపిస్తున్నాయి. మరీ అడ్వాన్స్‌గా ఇరు పక్షాలను ఇరుకున పెట్టేందుకూ దాదాపు అన్ని స్థానాలకూ భారాస అభ్యర్థులను సైతం ప్రకటించింది. భాజపా ఎవరిని దించాలో తెలియక తికమకపడుతుంటే, హస్తం పోటీదారుల ఒత్తిళ్లను తట్టుకోలేకపోతోంది. భారాస వదిలేసిన వాళ్లను తెచ్చుకునేందుకు రెండు పార్టీలు పోటీ పడుతున్నాయి.. తెర వెనుక పావులు కదుపుతున్నాయి. అయితే అన్ని జిల్లాల్లో ఒకెత్తు అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మాత్రం భిన్న వాతావరణం కనిపిస్తుంది. ఉమ్మడి 10 జిల్లాల్లో దాదాపు అంతటా భారాస, కాంగ్రెస్ వన్ సైడ్ వార్ కు కాలు దువ్వుతుంటే, కరీంనగర్‌లో మాత్రం త్రిముఖ పోరు కనిపిస్తోంది. ఇక్కడున్న 13 స్థానాల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. నాలుగు కాంగ్రెస్, నాలుగు భాజపా, నాలుగు భారాసలు పంచుకోగా ఒక్కస్థానానికి మూడు పార్టీలు నువ్వానేనా అన్నట్టు తలపడతాయి. ఉమ్మడి కరీంనగర్ జనంతో మాట్లాడి.. సర్వే చేసి అందిస్తున్న “మన ఈనాడు” మార్క్ కథనమిది..!
ఈటలకే జీ హుజూర్!
హుజూరాబాద్ ఇప్పుడు రాష్ట్రంలో సంచలన నియోజకవర్గం. దళితబంధు అమలుకు దారిచ్చిన ఈ నియోజకవర్గంలో అధికార భారాస నుంచి కౌశిక్ రెడ్డి అభ్యర్థిత్వం ఖరారవగా, కాంగ్రెస్ నుంచి బల్మూరి వెంకట్ దిగనున్నారు. అయితే స్థానికంగా ఈటలకు ఉన్న పట్టు, జనంలో ఉన్న అభిమానం మరోసారి ఈటలనే గెలిపిస్తుందనే మాట వినిపిస్తోంది. నియోజకవర్గంలో వాతావరణం కూడా కమలానికి అనుకూలంగానే కనిపిస్తోంది.
మంథని దుద్దిళ్లదే..!
మంథనిలో అధికార పార్టీ అభ్యర్థికి సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకతతో పాటు పలు నేరారోపణలు బలంగా జనంలోకి వెళ్లిన నేపథ్యంలో ఇక్కడ మరోసారి కాంగ్రెస్ అభ్యర్థి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకే విజయవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికోసం భారాస నేతలను రెచ్చగొట్టి, ఆశచూపి తనవైపు తిప్పుకునే ప్రయత్నం ఇక్కడి సీనియర్ కాంగ్రెస్ నేత చేస్తున్నట్టు సమాచారం.
అనుచరుల ఆగడాలే మంత్రికి మైనస్!
ధర్మపురిలో వరసగా గెలుస్తూ వస్తున్న మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు సొంత పార్టీ నేతలే మైనస్. పోటీకి ఎవరూ ముందుకు రాకపోయినా వారు స్థానికంగా చేసిన తప్పులు, కొందరు కిందిస్థాయి నేతలపై కబ్జాల ఆరోపణలు, దాడులతో పాటు కొందరు సోషల్ మీడియా వారియర్ల అత్యుత్సాహం ఆయనకు ఎదురుదెబ్బగా మారనుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే గనక నిజమైతే, ఇక్కడ ఆరుసార్లు ఓడిపోయిన సింపథీ, పోయిన ఎన్నికల్లో అతి తక్కువ ఓట్ల తేడాతో సీటుకు దూరమైన దళిత నాయకుడు, జగిత్యాల జిల్లా డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి గెలిచే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే కొప్పుల నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం మొదలుపెట్టగా.. అడ్లూరి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ఇక్కడి నుంచి భాజపా తరఫున పోటీ చేసేందుకు మాజీ ఎంపీ వివేక్ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. దాదాపు అభ్యర్థిత్వం ఖరారైనప్పటికీ స్థానికంగా బలమైన క్యాడర్ లేకపోవడం ఆయనకు ఎదురుదెబ్బే.
జగిత్యాల జీవన్‌దే!
సీనియర్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గెలుపు ఈసారి దాదాపు ఖాయమైనట్టే కనిపిస్తుంది. పోయిన ఎన్నికల్లో అనూహ్యంగా భారాస అభ్యర్థి డాక్టర్ సంజయ్ గెలవగా, ఈసారి హస్తం శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో జనంలోకి వెళ్తుండగా జీవన్‌కు ఎన్నికల్లో ఎర్రతివాచీ పరిచినట్టయింది. భారాసలో అంతర్గత విబేధాలు, మున్సిపాలిటీ పరిధిలో నేతల అక్రమాలు, జీవన్ రెడ్డిపై ఉన్న అభిమానం, భారాసలో ఓ ఎమ్మెల్సీగా ఉన్న నేత సామాజికవర్గం జీవన్ వైపు మొగ్గు చూపడం, పరోక్షంగా భాజపాలో ఓ ఎంపీ అనుచరుల సపోర్ట్ ఈసారి హస్తానికి కలిసిరానున్నాయి.
మానకొండూర్: ఇక్కడి నుంచి అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న రసమయిని ఓడించేందుకు సొంత పార్టీ నేతలే ప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం. ఇక్కడ భాజపా బలమైన అభ్యర్థిని దింపి గెలవాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం.
కరీంనగర్ బలం గంగుల..!
కరీంనగర్‌లో భాజపా తరఫున మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ పోటీకి విముఖత చూపిస్తున్నట్టు తెలుస్తోంది.. ఈ లెక్కన గంగుల కు బలమైన పోటీ లేనట్టే. స్థానికంగా కనిపిస్తున్న నగర అభివృద్ధి, భారాస పార్టీ బలం మరోసారి కమలాకర్‌కు కలిసిరానున్నాయి.
హుస్నాబాద్ నుంచి బలమైన పోటీలేకపోవడంతో.. మరోసారి భారాస నుంచి కెప్టెన్ తనయుడికే గెలుపు అవకాశాలు కనిపిస్తున్నాయి.
పెద్దపల్లి ద్విముఖ పోరు!
పెద్దపల్లిలో దాదాపు దాసరి మనోహర్‌రెడ్డే గెలిచేలా కనిపిస్తున్నా.. కాంగ్రెస్ అభ్యర్థికి గత ఎన్నికల్లో 40% ఓట్లు పోలయ్యాయి. భారాసకు అదే ఎన్నికల్లో 43% పోలయ్యాయి. స్థానికంగా కాంగ్రెస్ క్యాడర్, అభ్యర్థిపై సింపథీ కలిసొస్తే హస్తం నుంచి గులాభీకి గట్టిపోటీ తప్పదు.
చొప్పదండి కమలానికి!
ఇక్కడి అధికార పార్టీ అభ్యర్థికి స్థానికంగా కాస్త వ్యతిరేకత ఎదురవుతోంది. అదే కలిసొస్తే భాజపా సీటు కోసం ప్రయత్నిస్తున్న బొడిగే శోభకు దాదాపు గెలుపు ఖాయం.
సిరిసిల్లా.. కేటీఆర్ ఖిల్లా!
కేటీఆర్ కంచుకోటగా మారింది సిరిసిల్లా. కొన్నేళ్లలోనే జిల్లాగా అవతరించడం, అనూహ్యమైన ప్రగతిని ఇక్కడి జనం చూడటం కేటీఆర్‌కి ప్లస్. ఈ ఎన్నికల్లో గెలిస్తే ముఖ్యమంత్రి అవుతారన్న ఆశలున్నాయి కాబట్టి స్థానిక జనాన్ని మరింత మెజారిటీ కోసం తిప్పుకునేందుకు కలిసొచ్చే అంశం.
వేములవాడ.. త్రిముఖ పోరు!
ఇక్కడ భారాస సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చి బలమైన నేత చల్మెడకు సీటిచ్చింది. భాజపా నుంచి బండి సంజయ్ పోటీ చేస్తారనే వాదన వినిపిస్తున్నప్పటికీ గవర్నర్ విద్యాసాగర్‌రావు తనయుడికే సీటు దక్కుతుందని తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి ఆది శ్రీనివాస్ కూడా బలమైనే నేతే. ఈ ముగ్గురికీ దాదాపు నియోజకవర్గంలో సమాన బలం కనిపిస్తుండటంతో ఇక్కడ త్రిముఖ పోరు తప్పకపోవచ్చు. గెలుపు అవకాశాలు హస్తం వైపే కనిపిస్తున్నాయి.
కోరుట్ల ఎమ్మెల్యే కొడుకుదే!
బలమైన అభ్యర్థులు లేకపోవడం, స్థానికంగా భారాస అభ్యర్థికి ఉన్న మంచి పేరు ఈసారి అధికార పార్టీకే కలిసి రానున్నాయి. గెలుపు అవకాశాలు పూర్తిగా ప్రస్తుత ఎమ్మెల్యే తనయుడు కల్వకుంట్ల సంజయ్ వైపే కనిపిస్తున్నాయి.
రామగుండం చందర్‌దే..!
గత ఎన్నికల్లో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి గెలిచి గులాబీ కండువా కప్పుకున్న కోరుకంటి చందర్ కు స్థానికంగా ఉన్న ప్రజాధరణ మరోసారి పట్టం కట్టనుంది. ఉద్యోగాల పేరిట కుంభకోణం చేశారనే ఆరోపణలు వచ్చినా వాటిని బలంగా జనంలోకి తీసుకెళ్లడంతో ఇతర పార్టీలు విఫలమయ్యాయి. అధినేత అండదండలు, పార్టీకి అనుయాయుడిగా ఉంటూ రావడం, పార్టీ నేతలను చేరదీయడం, బలమైన ప్రతిపక్షం లేకపోవడం చందర్ కు మరోసారి కలిసొచ్చే అంశాలు.