భారత్(Team India) అదరగొట్టింది. ICC ఈవెంట్స్‌లో చిరకాల ప్రత్యర్థిపై ఆధిపత్యాన్ని కొనసాగించింది. బౌలింగ్ కుల్దీప్ యాదవ్(Kuldeep Yadhav) పాక్ ప్లేయర్లను తిప్పేయగా.. బ్యాటింగ్‌లో ఛేజ్ మాస్టర్ కింగ్ కోహ్లీ(Virat Kohli) ఆ జట్టుకు దిమ్మదిరిగే షాక్ ఇచ్చాడు. ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy 2025)లో భాగంగా ఆదివారం దుబాయ్(Dubai) వేదికగా జరిగిన మ్యాచులో రోహిత్ సేన 6 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. దీంతో 2017 ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్లో ఆ జట్టుపై ఎదురైన పరాభవానికి తాజా గెలుపుతో కసితీరా ప్రతీకారం తీర్చుకున్నట్లైంది. ఈ అపూర్వ విజయంతో భారత్ గ్రూప్-A నుంచి సెమీస్(Semis) బెర్త్ ఖరారు చేసుకోగా.. ఆడిన రెండు మ్యాచుల్లో ఓడిన పాక్ సెమీస్ రేసు నుంచి దాదాపు ఇంటిదారి పట్టినట్లే.
పరుగులు చేయడానికి చెమటోడ్చని పాక్
చాలా రోజుల తర్వాత వన్డేల్లో పాకిస్థాన్(Pakistan)తో తలబడిన భారత్.. ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆ జట్టుకు తేరుకోలేని షాకిచ్చింది. ఆదివారం జరిగిన మ్యాచులో టాస్ నెగ్గిన పాక్.. తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. భారత బౌలర్ల ధాటికి ఆ జట్టు బ్యాటర్లు పరుగులు చేయడానికి చెమటోడ్చారు. దీంతో ఆజమ్ 23, షకీల్ 62, రిజ్వాన్ 46, సల్మాన్ 19, ఖుష్‌దిల్ 38 పరుగులు సాధించడంతో 49.4 ఓవర్లకు 241 రన్స్‌కి ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో కుల్దీప్ 3, పాండ్య 2, రాణా, అక్షర్, జడేజా తలో వికెట్ కూల్చారు.

కోహ్లీని అందుకే అంటారు ఛేజ్ మాస్టర్ అని..
అనంతరం 242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్(Team India)కు గిల్, రోహిత్ శుభారంభం ఇచ్చారు. తొలి వికెట్‌కు 31 రన్స్ జోడించారు. ఈ క్రమంలో షాహీన్ వేసిన ఓ అద్భుత యార్కర్‌కు రోహిత్ అనూహ్యంగా ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ(Virat Kohli) చకచకా సింగిల్స్, కుదిరినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును ఉరకలుపెట్టించాడు. ఈ క్రమంలో అద్భుతంగా ఆడుతున్న గిల్ (46)ను అబ్రార్ ఔట్ చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన శ్రేయస్, కోహ్లీకి జతకట్టాడు. దీంతో వీరిద్దరూ పాక్ బౌలర్లను దీటుగా ఎదుర్కొని పరుగులు పిండుకున్నారు.

బౌండరీతోనే శతకం.. భారత్ విజయం
అయితే.. ఇంకో 28 పరుగులు చేస్తే భారత్ విజయం ఖాయమనుకునే టైంలోనే శ్రేయస్ (56) ఔటయ్యాడు. ఆ వెంటనే పాండ్య కూడా (8) రన్స్‌కే వెనుదిరిగాడు. కానీ అవతలి ఎండ్‌లో ఉన్న కోహ్లీ(100) పాక్‌కు ఛాన్స్ ఇవ్వలేదు. బౌండరీతో వన్డేల్లో 51వ సెంచరీతో పాటు భారత్‌కు మరుపురాని విజయాన్ని అందించాడు. పాక్ నిర్దేశించిన టార్గెట్‌ను భారత్ 42.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సెంచరీతో చెలరేగిన కింగ్ కోహ్లీకి “మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్” అవార్డు దక్కింది. కాగా భారత్ తన తర్వాతి మ్యాచులో న్యూజిలాండ్(NZ)తో మార్చి 2న న్యూజిలాండ్‌తో ఆడనుంది.
#ViratKohli𓃵 is the greatest player on the planet to hold the bat🐐#INDvsPAK pic.twitter.com/P0SQYRuapS
— KohliForever (@KohliForever0) February 23, 2025






