Mana Enadu : హైదరాబాద్ ఫార్ములా ఈ కార్ రేసింగ్ (Formula E Race Case) వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై శుక్రవారం (డిసెంబరు 27) రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం (Telangana HC) విచారణ చేపట్టింది. కోర్టు ఆదేశం మేరకు కౌంటర్ దాఖలు చేసిన ఏసీబీ .. కేటీఆర్‌ను అరెస్టు చేయకుండా జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరింది.
ఈనెల 31 వరకు మధ్యంతర బెయిల్ పొడిగింపు
అయితే కేటీఆర్ (KTR Bail News) కు ప్రస్తుతానికి ఊరట కల్పిస్తూ ఆయణ్ను అరెస్టు చేయొద్దన్న ఉత్తర్వులను ఈ నెల 31వ తేదీ వరకు హైకోర్టు పొడిగించింది. తదుపరి విచారణను ఈ నెల 31వ తేదీకి వాయిదా వేసింది. ఈ నెల 30వ తేదీ వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దని వారం రోజుల క్రితం హైకోర్టు ఏసీబీని ఆదేశించిన విషయం తెలిసిందే.
కేటీఆర్ క్వాష్ పిటిషన్ విచారణ
ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో నిబంధనలకు విరుద్ధంగా రూ.54 కోట్లు విదేశీ సంస్థకు చెల్లించారని పురపాలక పట్టణాభివృద్దిశాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ (Dana Kishore ACB Complaint) ఇచ్చిన ఫిర్యాదుతో ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా.. విచారణ చేపట్టిన ధర్మాసనం డిసెంబర్ 30 వరకు అరెస్ట్ చేయొద్దని నోటీసులు ఇచ్చి విచారణ జరపాలని సూచించింది.
దాన కిశోర్ వాంగ్మూలం నమోదు
కేటీఆర్ బెయిల్ పిటిషన్ పై ఏసీబీ కౌంటరు దాఖలు చేయడంతో ఇవాళ మరోసారి హైకోర్టు (Telangana HC On Formula E Race) విచారణ చేపట్టింది. ఈ క్రమంలో ఈనెల 31వ తేదీ వరకు కేటీఆర్ ను అరెస్టు చేయొద్దంటూ మధ్యంతర బెయిల్ గడువును పొడిగించింది. ఇక అంతకుముందు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో దానకిషోర్ వాంగ్మూలాన్ని ఏసీబీ అధికారులు రికార్డు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ పెండింగ్‌లో ఉన్న దృష్ట్యా A1 కేటీఆర్, A2 అరవింద్ కుమార్, A3 BLN రెడ్డిలకు ఏసీబీ ఇంకా నోటీసులు జారీ చేయలేదు.







