
ఒకప్పుడు ఆడపిల్ల పుట్టిందంటే ఆ ఇంట్లో అందరికీ హడలే. కొందరైతే ఆడపిల్ల అని తెలియగానే కడుపులో ఉండగానే చంపేసిన ఉదంతాలున్నాయి. మరికొందరు కళ్లు తెరిచి భూమ్మీదకు రాగానే చెత్తబుట్టల్లోనో.. ముళ్లపొదల్లోనో వదిలేసిన ఘటనలూ ఉన్నాయి. ఇంకొందరైతే మరింత రాక్షసంగా ఆడపిల్ల పుట్టిందని పురిట్లోనే గొంతు నులిమిన సందర్భాలూ ఉన్నాయి. కానీ ఇప్పుడు కాలం మారింది. చాలా వరకు ఇలాంటి ఘటనలు తగ్గిపోయాయి. ఇంట్లో ఆడపిల్ల ఉంటే మహాలక్షి ఇంట తిరిగినట్లుంటుందని ఇప్పుడు చాలా మంది భావిస్తున్నారు. అమ్మాయి పుట్టిందంటే మహాలక్ష్మి ఇంట్లో అడుగుపెట్టిందని సంబురపడే రోజులు వచ్చేశాయి.
మా పాప మా ఇంటి మణిదీపం
అయినా సరే.. రోజూ ఏదో చోట ఆడపిల్ల కడుపులో ఉండగానో లేదా పుట్టిన తర్వాతనో ఊపిరి తీస్తున్న ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి అని.. అమ్మాయిలు అబ్బాయిలకు ఏమాత్రం తీసిపోరంటూ ప్రభుత్వాలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగానే అమ్మాయి పుట్టడం అదృష్టమనే భావన పెంచేలా ఖమ్మం జిల్లాలో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మా పాప – మా ఇంటి మణిదీపం అనే సరికొత్త కార్యక్రమాన్ని ఆయన ఇవాళ ప్రారంభించారు.
ఆడపిల్ల పుడితే మిఠాయిల పంపిణీ
ఈ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్, ఇతర అధికారులు ఆడపిల్లలు పుట్టిన ఇళ్లకు వెళ్తారు. వారి ఇంట్లోకి మహాలక్ష్మి అడుగుపెట్టిన సందర్భంగా మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఇవాళ తల్లాడ మండలం రామచంద్రపురంలో ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ప్రారంభించారు. ఆ గ్రామంలో బానోతు కృష్ణవేణి- భరత్ నాయక్ దంపతులకు 2025 మార్చి 1న ఆడపిల్ల జన్మించిందని, ఈ సందర్భంగా ఈ కుటుంబానికి జిల్లా కలెక్టర్ స్వీట్ బాక్స్, ఫ్రూట్స్, సర్టిఫికెట్ అందించి శాలువాతో సన్మానించారు. భగవంతుడి అవకాశం ఇస్తే తనకూ ఆడపిల్ల పుట్టాలనే కోరుకుంటానని కలెక్టర్ అన్నారు. అమ్మాయిలు చూపించే అంత ప్రేమ అబ్బాయిలు చూపించరని తెలిపారు.
అమ్మాయిలకు అవకాశం ఇవ్వాలి
‘నేటి తరంలో అబ్బాయిల కంటే అమ్మాయిలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. మన ఇంట్లో పుట్టిన ఆడపిల్లలకు మగ పిల్లలతో సమానంగా విద్య, వ్యాపార, ఆస్తి, అవకాశాల్లో భాగం కల్పించాలి. అబ్బాయిలతో సమానంగా ఆడపిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలి. మంచి విద్య, ఇతర ప్రాంతాలకు వెళ్లి ఏదైనా సాధించేందుకు అవకాశం, ప్రోత్సాహకాలు అందజేయాలి. అమ్మాయి ఆశించిన మేరకు చదువుకున్న తర్వాత ఉద్యోగం లేదా వ్యాపారంలో స్థిరపడి సొంత ఆదాయ వనరులు సంపాదించుకున్న తర్వాత మాత్రమే పెళ్లి గురించి ఆలోచించాలి. ఆడపిల్లల భావాలకు గౌరవం ఇవ్వాలి.’ అని కలెక్టర్ తెలిపారు.