
తిరుమలలో మరోసారి చిరుత (Leopard) సంచారం కలకలం రేపుతోంది. ఇప్పటికే అలిపిరి నడకమార్గంలో (Alipiri Route) చిరుత పులి దాడిలో వల్ల పలువురు భక్తులు గాయపడిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఈ క్రూరమృగం సంచరిస్తోందన్న వార్తలతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. సోమవారం రాత్రి తిరుపతి జూ పార్కు రోడ్డులో కనిపించిన చిరుత.. మంగళవారం వేకువజామున గాలిగోపురం సమీపంలోని మెట్ల మార్గంలో సంచరించడం అక్కడున్న సీసీకెమెరాలకు చిక్కింది.
పిల్లిని వేటాడిన చిరుత
అలిపిరి నడకమార్గంలోకి వచ్చిన చిరుత.. పిల్లి(Cat)ని వేటాడి అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లడం అధికారులు సీసీటీవీలో రికార్డయిన దృశ్యాల్లో గమనించారు. ఈ దృష్యాలు చూసిన దుకాణదారులు, భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. మళ్లీ చిరుత వచ్చిందన్న వార్తలతో అలిపిరి మార్గంలో నడవాలంటే జంకుతున్నారు. ఇక చిరుత సంచారం విషయం తెలుసుకున్న మెట్ల మార్గం వద్ద ఉన్న దుకాణదారులు అటవీ, టీటీడీ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు.
గుంపులు గుంపులుగా వెళ్లండి
సమాచారం అందుకున్న అధికారులు సంఘటనాస్థలికి చేరుకున్నారు. అయితే చిరుత కోసం గాలింపు చేపట్టగా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడా కనిపించలేదు. అయితే ఎందుకైనా మంచిదని ముందస్తు జాగ్రత్తలో భాగంగా టీటీడీ అధికారులు మెట్ల మార్గంలో వస్తున్న భక్తులను అలర్ట్ చేశారు. మధ్యాహ్నం 2 గంటల వరకే 12 ఏళ్ల లోపు చిన్న పిల్లలను నడక మార్గంలో తీసుకెళ్లేందుకు అనుమతిని ఇచ్చారు. ఆ తర్వాతభక్తులు గుంపులు గుంపులుగా వెళ్లాలని టీటీడీ అధికారులు సూచించారు.