
“నేను సంపాదించిన ఇల్లు.. ఆస్తులు నా రెండో కుమారుడు మంచు మనోజ్ ఆక్రమించాడు. తల్లిదండ్రులు, వృద్ధులు, సంరక్షణ, పోషణ చట్టం కింద నాకు రక్షణ కల్పించండి. బాలాపూర్ మండలం జల్‌పల్లి గ్రామంలో నేనుంటున్న ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి ఆస్తులు కావాలంటూ డిమాండ్ చేస్తున్నాడు.” అంటూ ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు (Manchu Mohan Babu) రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు గత నెల ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తన ప్రతినిధితో లేఖను పంపారు.
మనోజ్‌కు తాఖీదులు
ఈ నేపథ్యంలో ఫిర్యాదుకు స్పందించిన రెవెన్యూ అధికారులు సదరు చట్టం ప్రకారం మంచు మనోజ్(Manchu Manoj)కు వారం క్రితం తాఖీదులు పంపించగా.. వాటికి సమాధానమిచ్చేందుకు మనోజ్ కొంగరకలాన్‌లోని కలెక్టరేట్‌కు శనివారం రోజున విచారణకు హాజరయ్యారు. మోహన్‌బాబు ప్రతినిధి గత నెల కలెక్టరేట్‌కు వచ్చి తనను కలిసి కుమారులు, ఆస్తుల గురించి వివరించి ఫిర్యాదు చేశారని .. ఫిర్యాదులో పేర్కొన్న అంశాల ఆధారంగా విచారణ నిర్వహించేందుకు ట్రైబ్యునల్ కార్యాలయం ద్వారా మనోజ్‌కు తాఖీదులు పంపించామని కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు.
డబ్బుల్లేకపోతే సినిమా ఎలా తీస్తున్నారు?
మరోవైపు తన తండ్రి, అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు లేవని మంచు మనోజ్ తెలిపారు. అదనపు కలెక్టర్ ముందు హాజరైన అనంతరం ఆయన కలెక్టర్ కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడుతూ.. తమ విద్యాసంస్థలు, ట్రస్ట్‌లో విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని వ్యతిరేకించినందుకే అన్నయ్య మంచు విష్ణు, నాన్న మోహన్‌బాబు (Mohan Babu)ను అడ్డుపెట్టుకుని నాటకమాడుతున్నారని ఆరోపించారు. డబ్బుల్లేవ్ అని చెబుతున్న వాళ్లిద్దరు రూ.వందల కోట్ల బడ్జెట్‌తో సినిమాలు ఎలా తీస్తున్నారని ప్రశ్నించారు.