సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి జాతర (Komuravelli Mallanna) ఇవాళ (జనవరి 19వ తేదీ) ఘనంగా ప్రారంభమైంది. సంక్రాంతి తర్వాత వచ్చిన తొలి ఆదివారం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున మల్లన్న సన్నిధికి తరలివచ్చారు. ఈ సందర్భంగా స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. సుమారు రెండున్నర నెలల పాటు ఈ జాతర కొనసాగనుంది. ఉగాది (Ugadi Festival)కి ముందు వచ్చే ఆదివారంతో జాతర ముగుస్తుంది.
ప్రతి సండే ప్రత్యేక పూజలు
ఇప్పటి నుంచి మల్లన్న ఆలయం (Komuravelli Mallanna Temple)లో ప్రతి ఆదివారం విశేష కార్యక్రమాలు నిర్వహించనున్నారు. భక్తులు బోనాలతో ఆలయానికి తరలి వెళ్తారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు నైవేద్యం సమర్పించి.. పట్నం వేసి కల్యాణం జరిపిస్తారు. ఇలా భక్తులు తమ మొక్కులు తీర్చుకుంటారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భారీ ఎత్తున భక్తులు మల్లన్న సన్నిధికి పోటెత్తుతున్నారు.
భక్తుల కోసం ఏర్పాట్లు
మరోవైపు భక్తుల కోసం అధికారులు ఆలయ పరిసరాల్లో అన్ని ఏర్పాట్లు చేశారు. రాజగోపురం పక్కన ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసి.. వాటిపై చలువ పందిళ్లు వేయించారు. కొత్తగా నిర్మించిన ప్రసాదాల విక్రయం, ఆర్జిత సేవల రసీదుల అందజేత కేంద్రం వద్ద పక్కా క్యూలైన్లు నిర్మించి భక్తులు ఇబ్బందులు పడకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నారు.







