వాయవ్య తుర్కియే(Northwest Turkey)లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం(Earthquake) బలికేసిర్ ప్రావిన్స్‌లోని సిండిర్గి పట్టణంలో కేంద్రీకృతమైంది. తుర్కియే విపత్తు నిర్వహణ సంస్థ (AFAD) ప్రకారం ఆగస్టు 10న రాత్రి 7:53 గంటలకు భూమి ఉపరితలానికి 11 కిలోమీటర్ల లోతులో ఈ కంపనలు నమోదయ్యాయి. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) దీని తీవ్రతను 6.19గా నిర్ధారించింది. ఇస్తాంబుల్‌తో సహా పలు ప్రావిన్సుల్లో ప్రకంపనలు తీవ్రంగా అనిపించడంతో ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు.
రంగంలోకి సహాయక బృందాలు
ఈ భూకంపం ధాటికి 16 భవనాలు కూలిపోయాయని అంతర్గత వ్యవహారాల మంత్రి అలీ యెర్లికాయ(Minister Ali Yerlikaya) తెలిపారు. శిథిలాల కింద చిక్కుకున్న 81 ఏళ్ల వృద్ధుడు ఆసుపత్రి(Hospital)లో చికిత్స పొందుతూ మరణించాడు. మరో 29 మంది గాయపడ్డారు. సహాయక బృందాలు వెంటనే రంగంలోకి దిగి శిథిలాల తొలగింపు, గాయపడినవారిని ఆసుపత్రులకు తరలించే పనులు చేపట్టాయి. ప్రస్తుతం సహాయక చర్యలు పూర్తయ్యాయని, తీవ్రమైన ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్(Turkish President Recep Tayyip Erdogan) మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
2023లో 7.8 తీవ్రతతో భూకంపం
భౌగోళికంగా భూకంప మండలంలో ఉన్న తుర్కియేలో ఇలాంటి విపత్తులు(Disasters) తరచుగా సంభవిస్తుంటాయి. 2023లో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 53,000 మంది మరణించిన నేపథ్యంలో, అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ ఘటన తర్వాత 4.6 తీవ్రతతో అనంతర ప్రకంపనలు నమోదయ్యాయి, దీంతో భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేశారు.
☄️#BREAKING: Another Vudeo DROP from the Earthquake in Turkey! They were hit by a massive quake!
— Galaxy News United(GNU) (@GalaxyNewsUnit) August 10, 2025






