
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర (sammakka sarakka jatara). ఈ మహాజాతర ప్రతి రెండేళ్లకోసారి జరుగుతుంది. మహాజాతర జరిగిన మరుసటి ఏడాది మేడారంలో చిన్నజాతర జరుగుతుందనే విషయం తెలిసిందే. ఈ చిన్నజాతర ఇవాళ్టి (ఫిబ్రవరి 12వ తేదీ) నుంచి నాలుగు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు.
నేటి నుంచి 4 రోజులు
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జరిగే ఈ జనజాతరకు (medaram chinna jatara) తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు పోటెత్తుతారు. జాతర సమయంలో భారీగా రద్దీ ఉంటుందని.. చాలా మంది భక్తులు జాతరకు ముందు నుంచే వచ్చి తల్లులను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
దిష్టితోరణాలు
మాఘ శుద్ధ పౌర్ణమి అయిన నేటి నుంచి నాలుగు రోజుల పాటు ఈ జాతర ఘనంగా జరుగుతుంది. మేడారం గద్దెల చెంత కన్నెపల్లి ఆలయంలోనూ శుద్ధి నిర్వహించి దూపదీప నైవేద్యాలను పూజారులు సమర్పిస్తారు. వనదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి.. గ్రామంలోకి దుష్టశక్తులు రాకుండా మామిడాకులతో దిష్టితోరణాలు కడతారు. పున్నమి వెలుగుల్లో పూజారులు జాగారాలు చేస్తారు.
200 ప్రత్యేక బస్సులు
చిన్న జాతరకు 20 లక్షల మంది వస్తారని అధికారులు అంచనా వేశారు. దీనికి అనుగుణంగా రూ.5.30 కోట్లతో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. దాదాపు వేయి మంది పోలీసుల భద్రతా వలయంలో ఈ జాతర ఘనంగా జరగనుంది. భక్తులు ట్రాఫిక్ ఇబ్బందులతో అవస్థ పడకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. చిన్నజాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్ధం ఆర్టీసీ 200 దాకా ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది.