ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై పవన్ సోదరుడు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) స్పందించారు. మార్క్ లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ను షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం మార్క్ ఆరోగ్యం బాగానే ఉందని.. ఆ చిన్నారి కాళ్లకు స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు. త్వరలోనే కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.
అసలేం జరిగిందంటే..?
సింగపూర్‌లో స్థానిక పాఠశాలలో చదువుతున్న పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ (Mark Shankar).. మంగళవారం రోజున స్కూల్ లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడ్డాడు. ఆ చిన్నారి చేతులు, కాళ్లకు గాయమైనట్లు తెలిసింది. ఊపిరితిత్తుల్లోకి పొగ దూరడంతో మార్క్ అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ప్రస్తుతం సింగపూర్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
సింగపూర్ కు పవన్
విషయం తెలియగానే పవన్ కళ్యాణ్ ను సింగపూర్ వెళ్లాల్సిందిగా అధికారులు కోరగా.. ‘అడవితల్లి బాట (Adavi Thalli baata)’ కార్యక్రమంలో భాగంగా ఆయన అల్లూరి సీతారామరాజు జిల్లాలోని డుంబ్రిగుడ మండలం కురిడిలో పర్యటిస్తానని మాటిచ్చానని.. అక్కడి ప్రజలను కలిసిన తర్వాతే వెళ్తానని అన్నారు. ఈ సందర్భంగా ఆయన కురిడిలో పర్యటించి స్థానికులతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన సింగపూర్ కు వెళ్లనున్నట్లు సమాచారం.