Mana Enadu : రాష్ట్ర మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) అక్కినేని నాగార్జున కుటుంబంపై, నాగచైతన్య, సమంత విడాకులపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా పెనుదుమారం రేపిన విషయం తెలిసిందే. ఉన్నతమైన పదవిలో ఉండి, అదికూడా ఓ మహిళ అయి ఉండి.. మరో మహిళపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అంటూ టాలీవుడ్ (Tollywood) ప్రముఖులు మంత్రిపై తీవ్రంగా స్పందించారు. ఆమె కామెంట్స్ ను ఖండిస్తూ సినిమా ప్రపంచం ఇలాంటి వ్యాఖ్యలను సహించదంటూ FilmIndustryWillNotTolerate అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండింగ్ చేశారు.
కొండా సురేఖపై పరువు నష్టం దావా
ఇక బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ (KTR), అక్కినేని నాగార్జున (nagarjuna) మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. ఇక కొండా సురేఖ కూడా తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటూ కేవలం నటి సమంత (Samantha)కు క్షమాపణలు చెప్పారు. తన ఉద్దేశం ఎవరినీ కించపరచడం కాదని స్పష్టం చేశారు.
కొండా సురేఖ ఒంటరి కాదు
అయితే మంత్రి తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చి, క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా ఆమెపై పలువురు సినీ ప్రముఖులు ఇంకా ట్వీట్లు చేస్తున్నారంటూ మరో మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) మండిపడ్డారు. మంత్రి కొండా సురేఖ విషయంలో సంయమనం పాటించాల్సి ఉందని ఆయన అన్నారు. ఆమె వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నాక సినిమా వాళ్లు స్పందించడం సరికాదని హితవు పలికారు. వ్యాఖ్యలను మంత్రి వెనక్కి తీసుకున్నాక సమస్య ముగిసినట్టేనని.. బలహీనవర్గాల మహిళా మంత్రి ఒంటరి కాదు అని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
బీజేపీ.. బీఆర్ఎస్ ఒకటే
గాంధీభవన్లో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందులు అధిగమించి హామీలు నెరవేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం 10 నెలల పాలన విజయవంతంగా సాగిందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రైతుల పేరుతో మొన్న బీజేపీ (BJP).. నేడు బీఆర్ఎస్ (BRS) ఆందోళనకు దిగాయని చెప్పారు. ఆ రెండు పార్టీలు ఒకటేనని.. అందుకే ఒకరి తర్వాత ఒకరు ఆందోళన చేశారని వెల్లడించారు.






