ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ (MLA Quota MLC Elections 2025) అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. ఈ కోటాలో 5 ఎమ్మెల్సీ స్థానాలుండగా.. వీటిలో మూడు టీడీపీ, పొత్తులో భాగంగా జనసేన (Janasena), బీజేపీ (BJP)లకు చెరో స్థానం వచ్చింది. ఇక టీడీపీ మూడు స్థానాల్లో రెండు బీసీలకు, ఒకటి ఎస్సీకి కేటాయించింది. ఎమ్మెల్సీ స్థానాల్లో బలహీన వర్గాలకే పెద్దపీట వేస్తూ అభ్యర్ధులుగా కావలి గ్రీష్మ (SC), బీద రవిచంద్ర (BC), బీటీ నాయుడు(BC)లను పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసింది.
జనసేన, బీజేపీలకు చెరొకటి
ఇక జనసేన నుంచి ఇప్పటికే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానానికి కొణిదెల నాగబాబు (Nagababu) పేరును ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రకటించిన విషయం తెలిసిందే. నాగబాబు నామినేషన్ కూడా దాఖలు చేశారు. మరోవైపు ఆఖరి నిమిషంలో తమకు ఎమ్మెల్సీ స్థానం కేటాయించాలని డిమాండ్ చేసిన బీజేపీ తమ పంతం నెగ్గించుకుంది. ఈ పార్టీ తమ అభ్యర్థిగా సోము వీర్రాజు (somu veerraju) పేరును ఎంపిక చేసింది. కాసేపట్లో ఆయన ఎమ్మెల్సీ పదవి కోసం నామినేషన్ దాఖలు చేయనున్నారు.
టీడీపీకి మూడు
ఇక టీడీపీ రాయలసీమలోని కర్నూలు జిల్లాకు చెందిన బీసీ సామాజికవర్గ నేత బీటీ నాయుడు(BT Naidu)కి మరోసారి ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇచ్చింది. మహిళలకు ప్రాధాన్యతను ఇచ్చేందుకు ఎస్సీ సామాజికవర్గం నుంచి మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె కావలి గ్రీష్మ(Greeshma)ను ఎంపిక చేసింది. మరోవైపు పార్టీలో మొదటి నుంచి యాక్టివ్ గా ఉన్న బీద రవిచంద్రకు అవకాశం ఇచ్చింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ కు సోమవారంతో గడువు ముగియనుండటంతో ఎంపికైన అభ్యర్థులు ఇవాళ నామపత్రాలు సమర్పించనున్నారు.






