
తెలుగు రాష్ట్రాల్లో జరిగిన టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల(Teacher MLC Elections) ఫలితాలు వచ్చేశాయి. ఈ మేరకు తెలంగాణలో జరిగిన టీచర్ MLC ఎన్నికల్లో PRTU, BJP మద్దతిచ్చిన అభ్యర్థులు విజయం సాధించారు. NLG-KMM-వరంగల్ PRTU అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి, కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ ఎన్నికల్లో మల్కా కొమురయ్య విజయం సాధించారు. మల్కా కొమురయ్య(Malka Komuraiah)కు బీజేపీ మద్దతు పలికింది. ఈ ఫలితాలపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్(Bandi Sanjay) హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం BJP అని మరోసారి తేలిందన్నారు. కాంగ్రెస్, BRS కుమ్కక్కైనా బీజేపీకే పట్టభద్రులు పట్ట కట్టారని చెప్పారు. రాష్ట్రంలో రాబోయేది రామరాజ్యమేనని మరోసారి స్పష్టమైందని సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.
ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీగా గాదె శ్రీనివాసులు
ఇక ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీగా PRTU అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. APTF అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘువర్మపై రెండో ప్రాధాన్యత ఓట్లతో గెలుపొందారు. ఈ ఎన్నికల లెక్కింపు 11 గంటల పాటు నిరంతరాయంగా కొనసాగింది. మొత్తం 20,783 ఓట్లకు గాను 19,813 ఓట్లు చెల్లుబాటైనవి. దాదాపు 1,000 ఓట్లు తిరస్కరించబడ్డాయి. ఈ స్థానానికి గెలుపొందేందుకు మ్యాజిక్ నంబర్ 10,068 కాగా, గాదె శ్రీనివాసులు నాయుడు(Gade Srinivasulu Naidu) విజయం సాధించారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీగా రాజా
అటు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల(Graduate MLC elections) ఫలితాల్లో కూటమి హవా స్పష్టమైంది. ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్(Alapati Rajendra Prasad) ఘన విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు ముగిసేసరికి ఆలపాటి రాజాకి 82,320 ఓట్ల మెజార్టీ వచ్చింది. మొత్తం 9 రౌండ్లలో 1,45,057 ఓట్లు ఆలపాటి రాజా సాధించారు. PDF అభ్యర్థి లక్ష్మణరావు 62 వేల 737 ఓట్లు సాధించారు. మొత్తం 2,41,491 ఓట్లు పోలయ్యాయి. అందులో 26,679 ఓట్లు చెల్లనివే ఉన్నాయి. చెల్లుబాటు అయిన ఓట్లలో 60% పైగా ఓట్లు రాజా సాధించారు.