ManaEnadu: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Cm Revanth) నేడు (నవంబర్ 08) సందర్భంగా పాదయాత్ర చేపట్టనున్నారు. ఈనేపథ్యంలో ఆయన పలు కార్యక్రమాలలో పాల్గొననున్నారు. ఈమేరకు సీఎం షెడ్యూల్ విడుదలైంది. తొలుత రేవంత్ కుటుంబ సమేతంగా హెలికాప్టర్‌లో ఉదయం 8:45 గంటలకు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి చేరుకుంటారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం ఉదయం 10 గంటలకు YTDA అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఆలయంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
రైతులతో సమావేశం
అనంతరం.. మధ్యాహ్నం ఒంటి గంటకు వలిగొండ మండలం సంగెం గ్రామానికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకుంటారు. “మూసీ పునరుజ్జీవ ప్రజా చైతన్య యాత్ర(Musi Renaissance Public Awareness Campaign)” పేరుతో పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఈ యాత్రలో భాగంగా మూసీ నది వెంబడి పరీవాహక ప్రాంతాల్లో 6 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తూ వారి బాధలు తెలుసుకుంటూ మూసీకి పునరుజ్జీవం(Musi Renaissance Project)పై భరోసా కల్పించనున్నారు. ఈ క్రమంలో భీమ లింగం, ధర్మారెడ్డి కాల్వలను కూడా రేవంత్ రెడ్డి సందర్శించనున్నారు. అనంతరం మూసీ పరీవాహక ప్రాంత రైతులతో రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. రైతులను ఉద్దేశించి మాట్లాడతారు. రైతులతో సమావేశం అనంతరం తిరిగి HYDకి చేరుకుంటారు.
ఈ నెలలోనే టెండర్ల ప్రక్రియ
మూసీ పునరుజ్జీవనంపై ముందుకే వెళ్లాలని రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇదే నెలలో ఈ ప్రాజెక్టు పనులకు టెండర్లు(Tenders) పిలవనున్నారు. తొలివిడతలో బాపుఘాట్ నుంచి వెనక్కి అంటే గండిపేట, హిమాయత్ సాగర్ వరకు 21KM ఈ పనులు ప్రారంభిస్తారు. అదే సమయంలో మల్లన్నసాగర్ నుంచి గోదావరి నీటిని మూసీలో కలిపేందుకు అవసరమైన పనులు చేసేందుకు టెండర్లను పిలుస్తారు. GHMC మేయర్, ఇతర అధికారులు అక్టోబర్ మూడో వారంలో దక్షిణ కొరియాలోని సియోల్‌లో హన్ నది పునరుజ్జీవనాన్ని పరిశీలించి వచ్చిన విషయం తెలిసిందే.