రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన ప్రచార రథానికి విద్యుత్ తీగలు తగిలి తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన ప్రచార రథానికి విద్యుత్ తీగలు తగిలి తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. నాగౌర్ నియోజకవర్గంలో బిడియాద్ గ్రామం నుంచి పర్బత్‌సర్ వైపు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. అమిత్ షా రథంపై ప్రయాణిస్తుండగా, వాహనం పైభాగం వైర్‌కు తాకడంతో, బలమైన నిప్పురవ్వలు ఎగిసిపడ్డాయి. దీంతో విద్యుత్ వైరు తెగిపడింది. హఠాత్తు పరిణామంతో అప్రమత్తమైన బీజేపీ నాయకులు అమిత్ షాను సురక్షితంగా కిందకు దింపి మరో వాహనంలో అక్కడి నుంచి తరలించారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. కానీ విద్యుత్ వైరు తెగిపోయి స్పార్క్‌తో పడిపోయింది. నిప్పురవ్వలు రావడం, తీగలు తెగిపోవడంతో రథం వెనుక ఉన్న ఇతర వాహనాలు వెంటనే ఆగిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అమిత్ షా మరో వాహనంలో పర్బత్‌సర్‌కు వెళ్లి ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. అయితే ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై స్పందించిన రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం విచారణ జరుపుతుందని తెలిపారు. దీనిపై విచారణకు ఆదేశాలు ఇస్తామని చెప్పారు.
రాజస్థాన్‌లో నవంబర్ 25న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ అభ్యర్థులకు మద్దతుగా నాగౌర్‌లోని కుచమన్, మక్రానా, పర్బత్‌సర్‌లలో జరిగిన మూడు ర్యాలీల్లో అమిత్ షా ప్రసంగించారు. రాజస్థాన్‌లో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వ హయాంలో కనీస మౌలిక వసతులు కరవయ్యాయనా మండిపడ్డారు అమిత్ షా. రాజస్థాన్‌లో శాంతిభద్రతలు, విద్యుత్, ఆరోగ్య సదుపాయాలు క్షిణించాయన్నారు. పేద, బడుగు, వెనుకబడిన తరగతులను కాంగ్రెస్ అవమానించిందని ఆరోపించిన ఆయన, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తన కుమారుడు రాహుల్ గాంధీని దేశానికి ప్రధానిని చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని, రాజస్థాన్‌లో అశోక్ గెహ్లాట్ తన కుమారుడు వైభవ్ గెహ్లాట్‌ను ముఖ్యమంత్రిని చేయాలనుకుంటున్నారని ఆయన అన్నారు.