
పహల్గాం (pahalgam attack) ఘటన భారత్‌పై జరిగిన ఉగ్రదాడి మాత్రమే కాదని.. మానవత్వం, సోదరభావంపై జరిగిన దాడి అని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. సిక్కిం రాష్ట్ర 50వ అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధాని ప్రధా మోదీ శుభాకాంక్షలు తెలిపారు. వర్చువల్‌గా వారిని ఉద్దేశించి ప్రసంగించారు. సిక్కిం (Sikkim) అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని రకాలుగా సాయం చేస్తానని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్ గురించి ప్రధాని ప్రస్తావించారు.
పాక్ దుర్బుద్ధి బయటపడింది..
‘ఎన్నో భారతీయ కుటుంబాల సంతోషాన్ని టెర్రరిస్టులు హరించారు. భారత్‌లో చీలిక తెచ్చే ప్రయత్నం చేశారు. అయితే, భారత ఐకమత్యం ఎంత గొప్పదో ప్రపంచం చూసింది. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) ద్వారా దేశమంతా ఒక్కటై ఉగ్రవాదులకు దీటుగా బదులిచ్చింది. ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడంతో పాక్ ఆక్రోశం అక్కసుతో మన సైన్యం, పౌరులపై దాడులకు తెగబడింది. దీంతో ఆ దేశ బండారం, దుర్బుద్ధి బయటపడింది’ అని అన్నారు. పాక్ వైమానిక స్థావరాలను అత్యంత కచ్చితత్వంతో ధ్వంసం చేయడం ద్వారా భారత స్పందన ఎంత తీవ్రంగా ఉంటుందో వాళ్లకు చూపించామని పేర్కొన్నారు.
వాతారవణం అనుకూలించకపోవడంతో..
సిక్కిం అవతరణ వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్రాన్ని సందర్శించాల్సిన మోదీ.. అక్కడ వాతావరణం అనుకూలించకపోవడంతో పశ్చిమ బెంగాల్‌లోని బాగ్డోగ్రా నుంచి వర్చువల్‌గా ప్రసంగించారు. అనంతరం సిక్కింలో పలు అభివృద్ధికారక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. నమ్చీ జిల్లాలో రూ.750 కోట్లతో నిర్మించనున్న 500 పడకల జిల్లా ఆసుపత్రి, సాంగాచోలింగ్లోని ప్యాసెంజర్ రోప్‌వే, గాంగ్టాక్ జిల్లాలోని అటల్ అమృత్ ఉద్యానవనంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఈశాన్య రాష్ట్రాలే కేంద్రంగా ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని ప్రధాని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇటీవల ఈశాన్య రాష్ట్రాల ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ఢిల్లీలో జరిగిందన్న విషయాన్నీ మోదీ పేర్కొన్నారు.