మన ఈనాడు:శరద్ పవార్.. భారతదేశ రాజకీయాల్లో ఈ పేరు తెలియని వారుండరు. అండర్ వరల్డ్ మాఫియాలో కీలక వ్యక్తులకు అభయహస్తంగా ఉన్నారన్న ఆరోపణలు, ముంబై భూ కుంభకోణాలు, అవినీతి మరకలు, ఇప్పుడు కొడుకుతో పంచాయితీ.. ఇలా ఎప్పుడూ ఏదో వివాదం. ఒకానొక దశలో దేశ ప్రధానిని సైతం తన గుప్పిట పెట్టుకుని చక్రం తిప్పిన ఈ మహారాష్ట్ర నేత ఇప్పుడు ఇంటిపోరుతో చతికిలపడిపోయారు.. కొడుకు దెబ్బకు తన మానస పుత్రిక, రాజకీయంగా తనను అందుకోలేని ఎత్తులో నిలబెట్టిన నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీని చేజార్చుకున్నారు.

తన భవిష్యత్తు గురించి ఆలోచించకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం, కూతురికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారంటూ గతంలో ఎన్సీపీ నుంచి తన వర్గపు ఎమ్మెల్యేలతో బయటకి వచ్చిన అజిత్ పవార్ కోర్టు మెట్లెక్కారు. పార్టీని తమకే కట్టబెట్టాలని పట్టుబట్టారు. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతుతో మంగళవారం పార్టీపై పూర్తి హక్కులూ దక్కించుకున్నారు. అయితే, పార్టీ దూరమైనా.. ప్రాణమున్నంత కాలం ప్రజల కోసం పోరడతానంటూ తనకూ ఓ పార్టీని బుధవారం ప్రకటించారు శరద్ పవార్.
నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ – శరద్ చంద్ర పవార్ (ఎన్సీపీ- ఎస్సీపీ) పేరిట పార్టీని నమోదు చేయించుకున్నారు. వచ్చే శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో ఈ పార్టీ నుంచే తన వర్గం పోటీకి దిగుతుందని ప్రకటించారు. దీంతో మహరాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు మరింత రసవత్తరంగా మారాయి. గతంలో మాజీ సీఎం ఉద్దవ్ నుంచి తన సొంత పార్టీ శివసేన దూరం కాగా.. ఇప్పుడు మరో మాజీ శరద్ చేతి నుంచి ఎన్సీపీ వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది.








