సినీనటుడు పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali)కి రైల్వేకోడూరు మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించింది. గురువారం రాత్రి 9.30 నుంచి శుక్రవారం ఉదయం 5 గంటల వరకు సుదీర్ఘంగా కొనసాగిన వాదనల్లో పోసాని తరఫున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. బీఎన్‌ఎస్ యాక్ట్ (BNS Act) ప్రకారం పోసానికి 41ఏ నోటీసులు ఇచ్చి బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు. మరోవైపు పోసానికి రిమాండ్ విధించాలని పోలీసుల తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.
14 రోజుల రిమాండ్
ఇరువైపు వాదనలు విన్న మేజిస్ట్రేట్ మార్చి 12వ తేదీ వరకు పోసానికి రిమాండ్ విధించింది. అనంతరం పోసానిని పోలీసులు రాజంపేట సబ్ జైలుకు తరలించారు. పోసాని కృష్ణమురళికి ఖైదీ నంబర్ 2261 కేటాయించారు. సినీ పరిశ్రమపై విమర్శలు చేశారని పోసాని కృష్ణమురళిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 26వ తేదీన ఆయణ్ను హైదరాబాద్ లోని తన నివాసంలో ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆయనపై ఓబులవారిపల్లె పోలీసులు 196, 353(2), 111 రెడ్ విత్ 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి హైదరాబాద్ నుంచి ఏపీకి తీసుకొచ్చారు.






