Mana Enadu : టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh ) నుంచి చాలా రోజులుగా సినిమా రాలేదు. డబుల్ ఇస్మార్ట్ తర్వాత ఈ డైరెక్టర్ తన నెక్స్ట్ ప్రాజెక్టు ప్రకటించలేదు. ఆ సినిమా అంచనాలకు తగ్గట్టుగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. అయితే సినిమాల సంగతికి పక్కన బెడితే పూరీ.. తరచూ తన పాడ్ కాస్ట్ పూరీ మ్యూజింగ్స్ (Puri Musings) తో మాత్రం ప్రేక్షకులతో టచ్ లో ఉంటున్నాడు. ఈ పాడ్ కాస్ట్ లో పూరీ లైఫ్ లెస్సన్స్ చెబుతూ ఉంటాడు. తాజాగా ‘లాడ్జ్ (Puri Musings Lodge Story)’ అనే టైటిల్ తో లేటెస్ట్ పాడ్ కాస్ట్ రిలీజ్ చేశాడు ఈ దర్శకుడు. అందులో ఏం చెప్పాడంటే..?
‘‘భూమి మీద ఎన్నో కోట్ల జీవాలు రూపాయి ఖర్చు లేకుండా సరదాగా బతుకుతున్నాయి. కానీ, మనిషి మాత్రం ప్రతి దానికీ డబ్బు కడుతూ బతుకుతున్నాడు. మనకు దేవుడిచ్చిన ఈ గ్రహంపైన ప్రతి దానికి మనం డబ్బు ఎందుకివ్వాలి? నచ్చిన చోట గూడు కట్టుకుంటుంది పక్షి. తనకిష్టమున్న ప్రాంతంలో మొలుస్తుంది చెట్టు. తలచుకుంటే ప్రపంచ యాత్ర చేసొస్తుంది తిమింగలం. అడవికి రాజైన సింహానికి దాన్ని దాటాలంటే పాస్‌పోర్టు అవసరం లేదు. ఇవన్నీ ఫ్రీగా, క్రెడిట్ కార్డులు లేకుండా బతుకుతున్నాయి.
కానీ మనిషి.. తినాలన్నా డబ్బు కావాలి, ఇల్లు కట్టుకోవాలంటే స్థలం కొనుగోలు చేయాలి, కట్టాలంటే అనుమతులు తీసుకోవాలి. దేశ సరిహద్దు దాటాలంటే పాస్ పోర్టు కావాలి. ప్రపంచాన్ని ముక్కలు చేసేసుకుని.. అది వేరే దేశం.. ఇది వేరే ప్రాంతం అని గోడలు కట్టుకున్నాం. పైగా మన దేశంలో కూడా బతికినంత కాలం డబ్బు కడుతూనే ఉండాలి. చివరకు మన సమాధికీ డబ్బు కట్టాలి. ఈ పేమెంట్ సిస్టమ్ వల్ల ప్లానెట్ అర్థమే మారిపోయింది.
ఇది ఇల్లు కాదు.. లాడ్జ్. మిగతా జీవులన్నింటికి మాత్రమే ఇది ఇల్లు.. మనుషులకు మాత్రం లాడ్జ్. ఎందుకు పని చేస్తున్నామో ఎవరికీ తెలియదు. అందమైన క్షణాలు అమ్మేసుకుంటున్నాం. ఎంజాయ్‌చేసే టైమ్ లేదు. డబ్బు కోసం పరుగు పెడుతూనే ఉన్నాం. తాడూ బొంగరం లేని లైఫ్ అయితే.. హాయిగా పక్షుల్లా ఎగురుకుంటూ వెళ్లొచ్చు. మనం బతికేది బతుకు కాదు. మన కంటే కాకి మేలు. మళ్లీ జన్మంటూ ఉంటే మనిషిగా పుట్టించొద్దని దేవుడిని మొక్కుద్దాం.’’ అని పూరీ తన పాడ్ కాస్ట్ లో చెప్పుకొచ్చాడు.







