శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ (Dhanush), నాగార్జున (Nagarjuna) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కుబేర’ (Kubera). తెలుగు, తమిళ, హిందో భాషల్లో శుక్రవారం (ఈ నెల 20న) విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రంలో రష్మిక (Rashmika) హీరోయిన్గా నటించి మెప్పించారు. సమీరా పాత్రలో ఒదిగిపోయి నటించారు. దీంతో సినిమాలో తన పాత్రకు వస్తోన్న ఆదరణతో సంతోషం వ్యక్తం చేసింది రష్మిక. తాజాగా ఆసక్తికర పోస్ట్ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. శేఖర్ కమ్ముల వల్లే తాను ఆవిధంగా యాక్ట్ చేయగలిగానని అన్నారు.
నటిగా ఆయన నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు..
‘‘శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘కుబేర’లో సమీరా పాత్రలో నటించా. ఆయన వల్లే సమీరా పాత్రలో ఆవిధంగా ఒదిగిపోగలిగాను. వృత్తిపై ఆయనకున్న ప్రేమ తన సినిమాల్లో ఎప్పుడూ కనిపిస్తుంటుంది. అందుకే ఆయనతో కలిసి వర్క్ చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా. ‘కుబేర’తో నాకు అవకాశం దొరికినప్పుడు.. ఒక నటిగా ఆయన నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. అందుకే ఆయన చెప్పినవిధంగా ప్రతి సన్నివేశంలో యాక్ట్ చేయగలిగాను. ఆయన వల్లే ఈరోజు నాకు ఇంతటి ప్రశంసలు దక్కుతున్నాయి. అద్భుతమైన నటీనటులతో పనిచేసినప్పుడు వారికి సమానంగా యాక్ట్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది.
ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ది బెస్ట్
ధనుష్ లాంటి గొప్ప నటుడి పక్కన యాక్ట్ చేస్తున్నప్పుడు.. ప్రతి సీన్‌లో శ్రమించాల్సిందే. దేవాతో కలిసి సమీరా పాత్రలో నటించినందుకు ఎంతో సంతోషిస్తున్నా. నాగార్జున సర్ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. ఆయన నుంచి నేనెంతో స్ఫూర్తి పొందాను. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ది బెస్ట్. ఆయన జీవితం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. ఈ సినిమాలో భాగమైన టీమ్ అందరికీ, నా అభిమానులకు, సినీ ప్రియులకు ధన్యవాదాలు. సమీరా.. ఒక అందమైన గందరగోళం లాంటిది. సినిమా చూసిన తర్వాత నేను ఎందుకు ఇలా చెబుతున్నానో మీరే అర్థం చేసుకుంటారు. ప్రతిఒక్కరూ వీక్షించాల్సిన చిత్రమిది’ అని పేర్కొన్నారు.






