దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా (Ratan Tata) లక్షల కోట్ల సామ్రాజ్యానికి అధిపతిగానే కాదు.. మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా పేరు సంపాదించుకున్నారు. ఆయన ఒక మహోన్నత సామాజిక సేవకుడు. తనుకున్న వేల కోట్ల ఆస్తిని తన వద్ద పనిచేస్తున్న వారికి, పెంపుడు శునకాలకు ఇస్తూ వీలునామా రాసిన విషయం తెలిసిందే.
ఆ వ్యక్తికి రూ.500 కోట్లు
అయితే తాజాగా రతన్ టాటా వీలునామా (Ratan Tata Will) అంటూ మరో వీలునామా బయటకు వచ్చింది. అయితే అందులో ఓ రహస్య వ్యక్తికి తన ఆస్తిలో ఏకంగా రూ.500 కోట్లు ఇవ్వాలని రతన్ టాటా పేర్కొన్నట్లు ఉండటం చూసి ఆయన సన్నిహితులు షాక్ అవుతున్నారు. జంషెడ్‌పుర్‌కు చెందిన ట్రావెల్స్ వ్యాపారవేత్త మోహిని మోహన్ దత్తా(Mohini Mohan Dutta) ఆ రహస్య వ్యక్తి అని పలు మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. మోహన్ దత్తా ఆరు దశాబ్దాలకు పైగా రతన్‌టాటా దగ్గర నమ్మకంగా పని చేసిన విషయం తెలిసిందే.
చాలా ఏళ్ల నుంచి పరిచయం
తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్‌లో భాగమైన తాజ్ సర్వీసెస్‌తో 2013 నుంచి మోహన్ దత్తాకు చెందిన ‘‘స్టాలియన్ ట్రావెల్ ఏజెన్సీ’’ కలిసి పని చేస్తోంది. మోహిని .. టాటా కుటుంబానికి చాలా సన్నిహితంగా ఉండేవారని.. టాటా గ్రూప్‌నకు చెందిన అధికారులు తెలిపారు. డిసెంబర్ 2024లో ముంబయిలోని NCPA (ఎన్సీపీఏ)లో నిర్వహించిన రతన్ టాటా జన్మదిన వేడుకలకు దత్తాను ఆహ్వానించినట్లు సమాచారం.






