టాలీవుడ్‌లో సమంతకున్న(Samantha) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2010లో వచ్చిన “ఏ మాయ చేశావే”(Ye Maaya Chesave) సినిమాతో హీరోయిన్‌గా వెండితెరకు పరిచయమైన ఆమె, తొలి సినిమాతోనే భారీ విజయం సాధించి ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం ఏర్పరచుకుంది. ఆ తర్వాత ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో కలిసి హిట్ సినిమాల్లో నటించింది. సమంత నటనలో తన ప్రతిభను తమిళ చిత్ర పరిశ్రమలోనూ చూపించింది. అక్కడ కూడా ఆమెకు మంచి గుర్తింపు లభించింది.
నాగ చైతన్య(Naga Chaithanya)తో ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత, కొన్ని సంవత్సరాల పాటు సంతోషంగా జీవించారు. కానీ కొన్ని కారణాల వల్ల వీరి మధ్య విభేదాలు వచ్చి, చివరకు ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత నాగ చైతన్య రెండో వివాహం చేసుకోగా, సమంత మాత్రం ఇప్పటికీ సింగిల్‌గానే ఉంది.
విడాకుల అనంతరం ఆమె బాలీవుడ్‌లో అడుగుపెట్టి అక్కడ కూడా మంచి గుర్తింపు పొందింది. ఇటీవల తన 15 ఏళ్ల సినీ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ, సోషల్ మీడియా ద్వారా స్పందించిన సమంత.. ఈ ప్రయాణంలో తాను ఎదుర్కొన్న తీపి, చేదు అనుభవాల గురించి భావోద్వేగంగా చెప్పుకొచ్చింది. “జీవితంలో కొన్ని విషయాలు మర్చిపోవాలని అనుకున్నా… అవి మరచిపోలేము. కొన్ని మాత్రం ఇట్టే మర్చిపోతాం” అంటూ ఆమె తెలిపింది.
తాను మళ్లీ సినిమాల్లోకి రావడానికి కారణం ఒక్కరే అని చెప్పిన సమంత, ఆ వ్యక్తి పేరు రాహుల్ రవీంద్రన్(Rahul Ravindran) అని వెల్లడించారు. మయోసైటిస్ ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న సమయంలో, ప్రతిరోజూ రాహుల్ తన ఇంటికి వచ్చి, ఆటలు ఆడిస్తూ తనను ఉత్సాహపరిచారని తెలిపారు. రాహుల్ ఇచ్చిన ఆ మానసిక బలంతోనే తాను మళ్లీ సినిమాల్లోకి తిరిగి వచ్చానని చెప్పిన సమంత, ఒకసారి స్టేజ్ మీద కూడా “I love you Rahul” అని ప్రేమగా చెప్పింది సమంత.
రాహుల్ రవీంద్రన్ నటుడిగానే కాక, “చి.ల.సౌ.” వంటి హిట్ సినిమాతో దర్శకుడిగానూ పేరు తెచ్చుకున్నారు. సమంతతో ఆయన స్నేహం “ఏ మాయ చేశావే” సినిమాతో మొదలై, ఇప్పటికీ కొనసాగుతోంది.






