
నాగర్కర్నూల్ జిల్లా శ్రీశైలం ఎడమగట్టు కాల్వ వద్ద సొరంగం కూలిన ఘటన (SLBC Tunnel Collapse)లో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో ఎనిమిది సిబ్బంది చిక్కుకున్న విషయం తెలిసిందే. అయితే అందులో ఇప్పటికే ఒకరి మృతదేహం లభించింది. మరో ఏడుగురి కోసం రెస్క్యూ టీమ్ తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ నేపథ్యంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ నుంచి ఇవాళ మరో మృతదేహాన్ని సహాయక సిబ్బంది వెలికితీశారు.
మరో డెడ్ బాడీ గుర్తింపు
ఆ మృతదేహాన్ని నాగర్ కర్నూల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తవ్వకాలు జరుపుతుండగా లోకో ట్రాక్ వద్ద మృతదేహం ఆనవాళ్లు, దుర్వాసన వస్తున్నట్లు గుర్తించిన రెస్క్యూ టీమ్ ఆ చోట తవ్వకాలను జరిపగా మృతదేహం ఆనవాళ్లు కనిపించాయి. వెంటనే వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి డెడ్ బాడీ (SLBC Dead Body News)ని పంపించారు. మరో ఆరుగురి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
మరో ఆరుగురి కోసం గాలింపు
ఫిబ్రవరి 22వ తేదీన జరిగిన ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో 8 మంది కార్మికులు చిక్కుకోగా.. వారిలో ఇప్పటివరకు ఇద్దరు కార్మికుల మృతదేహాలను వెలికితీశారు. ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి సుమారు 30 మీటర్ల వరకు సహాయక చర్యలు చేపట్టేందుకు సిబ్బంది భయపడుతున్నట్లు సమాచారం. పైనుంచి మరోసారి మట్టి కుప్పకూలే ప్రమాదం ఉండటంతో సహాయక చర్యలు చేపట్టేందుకు వెనకాడుతున్నట్లు తెలిసింది. అక్కడ మట్టిని తవ్వితీసేందుకు మూడు రోబోలు (Robots in SLBC Tunnel) తీసుకురాగా ఒకటి మాత్రమే సొరంగంలోకి వెళ్లినట్లు అధికారులు తెలిపారు.