నాలుగు కోట్ల ప్రజల కల. ఎంతో మంది బలిదానాలు.. పోరాటాలు.. కొట్లాటలు. ఉద్యమమే ఊపిరిగా.. బానిస సంకేళ్లను తెగదెంపుకోవడమే లక్ష్యంగా సాగిన తెలంగాణ ఉద్యమం(Telangana Movement)లో ఫిబ్రవరి 18కి ప్రత్యేకత ఉంది. ‘ప్రత్యేక తెలంగాణ(Separate Statehood)’కు అడుగులు పడింది ఈ రోజే. తెలంగాణ రాష్ట్ర సాధన సుదీర్ఘ ఉద్యమం. ఇది ఉజ్వలమైన వీరోచిత పోరాటం, త్యాగాలకు చిరునామా.
ఎంతో మంది ఆత్మబలిదానాల ఫలితమే..
నీళ్లు.. నిధులు.. నియామకాలు.. కోసం 1969 నుంచి మలి దశ తెలంగాణ పోరాటం వరకూ ఇదే నినాదంతో ఎంతో మంది ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోశారు. ఎంతో మంది వ్యక్తులు వచ్చారు. వ్యవస్థలో కలిసిపోయారు. కానీ ప్రజల్లో ‘ప్రత్యేక’ నినాదం మాత్రం ఆగలేదు. మలిదశ ఉద్యమంలో మాజీ సీఎం కేసీఆర్(KCR) పాత్ర చాలా ప్రభావం చూపించింది. 2009 నవంబర్ 27న ఆయన ఆమరణ దీక్ష, అటు శ్రీకాంతా చారి(Srikantha Chari) ఆత్మబలి దానం, ప్రొ. జయశంకర్ అలుపెరగని పోరాటం వంటి ఘటనలతో కేంద్రం దిగొచ్చింది. ఈ క్రమంలోనే డిసెంబర్ 9, 2009 తెలంగాణ ప్రకటన వెలువడింది. ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణకు వడివడిగా అడుగులు పడ్డాయి.
71 పేజీల్లో ఏపీ పునర్‌విభజన బిల్లు
2014 ఫిబ్రవరి 18న తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఏపీ పునర్ వ్యవస్థీకరణ బిల్లు(AP Reorganization Bill)ను లోక్‌సభలో ఫిబ్రవరి 13న ప్రవేశపెట్టగా 18న ఆమోదం పొందింది. ఆ తర్వాత ఫిబ్రవరి 20న రాజ్యసభ కూడా ఆమోదించింది. ఆ తర్వాత మార్చి 1, 2014 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లును రాష్ట్రపతి(President) ఆమోదించగా ప్రభుత్వ గెజిట్‌లో ప్రచురించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్‌విభజన బిల్లు 71 పేజీల్లో ప్రచురించారు. దీంతో సుదీర్ఘ నిరీక్షణ, త్యాగాలు, పోరాటాల ఫలితంగా 2014, జూన్ 2న దేశంలో 29వ రాష్ట్రంగా 10 జిల్లాలతో ఏర్పడింది. కాగా 1956, నవబంర్ 1 నుంచి 2014 జూన్ 1 వరకు ఎన్నో పోరాటాలు, ఎంతోమంది ప్రాణత్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది.






