
అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం తర్వాత ఎయిరిండియా (Air India) విమానయాన సంస్థ తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఈ దుర్ఘటన జరిగిన తర్వాత సంస్థకు చెందిన పలు విమానాల్లో సాంకేతిక వెలుగుచూశాయి. మరోవైపు, నిర్వహణ సమస్యలూ సంస్థను వెంటాడుతున్నాయి. ఫలితంగా ఈ మధ్య పలు విమాన సర్వీసులు ఆలస్యమవుతున్నాయి. తాజాగా శుక్రవారం ఏకంగా ఎనిమిది సర్వీసులను రద్దు చేసినట్లు ఎయిరిండియా ప్రకటించింది. మెయింటెనెన్స్, కార్యాచరణ సమస్యల కారణంగా వీటిని రద్దు చేసినట్లు తెలిపింది.
రద్దయిన విమాన సర్వీసులు ఇవే..
* హైదరాబాద్ నుంచి ముంబయి వెళ్లాల్సిన ఏఐ2872
* దుబాయ్ నుంచి హైదరాబాద్ రావాల్సిన ఏఐ2204
* దుబాయ్ నుంచి చెన్నై రావాల్సిన ఏఐ906
* దిల్లీ నుంచి మెల్‌బోర్న్ వెళ్లాల్సిన ఏఐ308
* మెల్‌బోర్న్ నుంచి దిల్లీ రావాల్సిన ఏఐ309
* చెన్నై నుంచి ముంబయి వెళ్లాల్సిన ఏఐ571
* పుణె నుంచి దిల్లీ వెళ్లాల్సిన ఏఐ874
* అహ్మదాబాద్ నుంచి దిల్లీ వెళ్లాల్సిన ఏఐ456
జూన్ 21 నుంచి జులై 15 వరకు ఈ సర్వీసుల తగ్గింపు
నిర్వహణ సమస్యల కారణంగా జులై రెండో వారం వరకు తమ అంతర్జాతీయ విమాన సర్వీసులను 15 శాతం తగ్గించనున్నామని ఎయిరిండియా ఇదివరకే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 16 అంతర్జాతీయ మార్గాల్లో విమాన సర్వీసులను తగ్గించినట్లు కంపెనీ ప్రకటించింది. జూన్ 21 నుంచి జులై 15 వరకు ఈ సర్వీసుల తగ్గింపు కొనసాగుతుందని ఓ ప్రకటనలో పేర్కొంది. విమాన సర్వీసుల తగ్గింపుతో ప్రభావితమయ్యే ప్రయాణికులకు క్షమాపణలు తెలిపింది.