
పాకిస్థాన్(Pakistan), దుబాయ్(Dubai) సంయుక్త వేదికగా ఈనెల 19 నుంచి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy- 2025) జరగనున్న విషయం తెలిసిందే. అయితే, ఈ ట్రోఫీకి అంబాసిడర్(Ambassador)గా భారత మాజీ ఓపెనర్ శిఖర్ ధవన్(Shikhar Dhawan) ఎంపికయ్యాడు. ఈ మేరకు ICC తాజాగా నలుగురు అంబాసిడర్‌లను ప్రకటించింది. ధవన్‌తో పాటు 2017 ఛాంపియన్స్ ట్రోఫీ విజేత అయిన పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్(Sarfaraz Ahmed), ఆస్ట్రేలియాకు చెందిన షేన్ వాట్సన్(Shane Watson), న్యూజిలాండ్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీ(Tim Southee)లను ఐసీసీ ఈ టోర్నీకి బ్రాండ్ అంబాసిడర్లుగా ఎంపిక చేసింది.
రెండు సార్లు గోల్డెన్ బ్యాట్ అవార్డు
కాగా 2013లో మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) సారథ్యంలో టీమ్ఇండియా(Team India) ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో గబ్బర్ కీలక పాత్ర పోషించాడు. ఆ ఎడిషన్‌లో అద్భుత ప్రదర్శన చేసిన అతడు ‘Man of the Tournament’గా నిలిచాడు. అలాగే ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక సెంచరీలు(Centuries) చేసిన రికార్డు కూడా ధవన్ పేరిట ఉంది. అటు టోర్నీ చరిత్రలో వరుసగా రెండుసార్లు ‘Golden Bat’ అవార్డు అందుకున్న ఏకైక క్రికెటర్ కూడా శిఖర్ ధవన్ కావడం విశేషం.
ఆ క్షణాలు ఎప్పటికీ నా మదిలో పదిలంగా ఉంటాయి: ధవన్
ఈ నేపథ్యంలో శిఖర్ స్పందించాడు.”ఛాంపియన్స్ ట్రోఫీలో భాగం కావడం చాలా ప్రత్యేకమైన అనుభూతి(A unique feeling). ఈ రాబోయే ఎడిషన్‌కు అంబాసిడర్‌గా వ్యవహరించే అవకాశం దక్కడం గొప్పవిషయం. ఇది అభిరుచి, గర్వం, దృఢ సంకల్పం నుంచి పుట్టిన టోర్నమెంట్. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఇది చాలా ఉత్కంఠభరితమైన, భావోద్వేగ ప్రయాణంగా మారుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఆడిన క్షణాలు ఎప్పటికీ నా మదిలో పదిలంగా ఉంటాయి. ఈ టోర్నీలో 8 అత్యుత్తమ జట్ల పోరాటాన్ని మనం చూస్తాం” అని ధవన్ Xలో పోస్ట్ చేశాడు.