INDvsBAN: సెంచరీతో చెలరేగిన అశ్విన్.. భారీ స్కోరు దిశగా భారత్

ManaEnadu: చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌(Bangladesh)తో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ ఇండియా(Team India) భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 339/6 పరుగులు చేసింది. టాపార్డర్ విఫలమైనా ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) (102) సెంచరీతో చెలరేగాడు. మరో ఎండ్‌లో రవీంద్ర జడేజా(Ravindra Jadeja) (86) సహకారంతో అశ్విన్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. వీరిద్దరూ వన్డే తరహాలో బ్యాటింగ్ చేశారు. అంతేకాదు 195 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

అంతకు ముందు మరో ఓపెనర్ యశస్వీ జైస్వాల్(Yashasvi Jaiswal) (56) అర్ధ సెంచరీతో రాణించాడు. రోహిత్ 6, కోహ్లీ 6, పంత్ 39, రాహుల్ 16 పరుగులు చేసి ఔటయ్యారు. యంగ్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్ డకౌట్ అయ్యాడు. అటు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బంగ్లా ఆరంభంలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ భారత బ్యాటర్లపై ఒత్తిడి పెంచింది. ఈ క్రమంలో 144 పరుగులకే భారత కీలక బ్యాటర్లందరినీ పెవిలియన్‌కు పంపింది. బంగ్లా బౌలర్లలో హసన్ మొహమూద్ 4, రాణా, మిరాజ్ చెరో వికెట్ పడగొట్టారు.

కాగా ఈ మ్యాచ్‌ తొలిరోజు ఆటలో అశ్విన్-జడేజా ఆటే హైలైట్. ముఖ్యంగా సొంత గ్రౌండ్లో అశ్విన్ సెంచరీ(Century)తో చెలరేగి ఆడాడు. స్ట్రైక్ రొటేట్ చేస్తూనే మరో పక్క బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ఈక్రమంలోనే తన టెస్టు కెరీర్‌లో ఆరో సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. మరో ఎండ్‌లో జడేజా కూడా సూపర్ హాఫ్ సెంచరీ(86)తో కదం తొక్కాడు. అయితే ఒక్క సెంచరీతో అశ్విన్ ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నాడు. టెస్టుల్లో 20సార్లు 50కిపైగా స్కోర్లు, 30కిపైగాసార్లు ఒక ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీసిన తొలి ప్లేయర్(1st player) అతడే. అశ్విన్ టెస్టుల్లో 14 హాఫ్ సెంచరీలు, ఆరు సెంచరీలు చేయడంతోపాటు 36సార్లు ఒక ఇన్నింగ్స్ లో 5, అంతకంటే ఎక్కువ వికెట్లు తీశాడు.

టెస్టుల్లో 500కు పైగా వికెట్లు తీసిన ఆటగాళ్లు సాధించిన మొత్తం సెంచరీల సంఖ్య ఎనిమిది. ఆ ఎనిమిదింటిలో అశ్విన్ ఒక్కడే ఆరు సెంచరీలు సాధించాడు. అనిల్ కుంబ్లే(Anil Kumble) ఒక సెంచరీ చేయగా.. మరొకటి స్టువర్ట్ బ్రాడ్(Stuart Broad) చేశాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో తొమ్మిది మంది ఆటగాళ్లు 500కు పైగా వికెట్లు తీశారు. ముత్తయ్య మురళీధరన్(Muralidharan), షేన్ వార్న్, జేమ్స్ అండర్సన్, కుంబ్లే, బ్రాడ్, గ్లెన్ మెక్‌గ్రాత్, నాథన్ లయన్, కోర్ట్నీ వాల్ష్, అశ్విన్. అంతేకాదు టెస్టుల్లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేసిన అశ్విన్ అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు.

Share post:

లేటెస్ట్