మన ఈనాడు: తల్లి చిన్నప్పుడే రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. తండ్రి పనిచేస్తేనే పొట్ట నిండేది. సర్కారు బడిలో ప్రాథమిక విద్య వరకు నెట్టకొస్తే సరిపోతుంది అనుకున్నది ఆకుటుంబం. కానీ తన కష్టం పిల్లలకు రావొద్దని చదువు కోసం ఎంత దూరమైన వెనకడుగు వేసేది లేదని బలంగా అనుకున్నాడు. తండ్రి ఆశలను కూతరు సాధించి చూపింది.సర్కారు బడిలో చదువు..ఇస్రోలో శాస్త్రవేత్తగా కొలువు సాధించిన వరంగల్ జిల్లాకు చెందిన రాజ్యలక్ష్మి.
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన వనం ఉమాదేవి-, సదానందం దంపతులకు ఇద్దరు సంతానంలో రాజ్యలక్ష్మి పెద్ద! తల్లి ఉమాదేవి 2004 లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. అప్పటి నుంచి సదానందమే పిల్లలకు అన్నీతానయ్యాడు. చేనేత కార్మికుడిగా వచ్చేది చాలీచాలని సంపాదన. అయినా పిల్లల చదువు విషయంలో రాజీ పడలేదు. ఇల్లందలోనే పదో తరగతి దాకా చదివిన రాజ్యలక్ష్మి, ఇంటర్మీడియట్ పూర్తవ్వడంతోనే బాసర ట్రిపుల్ ఐటీలో సీటు సాధించింది. మొదటి నుంచి చదువులో ఉత్తమ ప్రతిభ కనబర్చే రాజ్యలక్ష్మి ఉన్నత విద్యపూర్తి చేశారు.. అక్కడ కూడా రాజ్యలక్ష్మి మెరుగైన ప్రతిభను గుర్తించిన అధ్యాపకులు అక్కడే ఆమెకు గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేసే అవకాశం కల్పించారు. అక్కడ పనిచేస్తూ అహర్నిశలు కష్టపడి పరీక్ష రాసి బెంగుళూరులోని ఇస్రోలో కేటగిరీ-బీలో సైంటి్‌స్టగా ఉద్యోగం సంపాదించింది. సదానందం కుమారుడు గోపాలకృష్ణ హైదరాబాదులోని ఏఎన్‌ఆర్ కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు.