
తెలంగాణలో కంచ గచ్చిబౌలి(Kancha Gachibowli Land)లో 400 ఎకరాల స్థలంలో చెట్ల నరికివేత(Tree Felling) విషయంలో సుప్రీం కోర్టు(Supreme Court) తీవ్రంగా స్పందించింది. బుధవారం సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వాని(Telangana Govt)కి చుక్కెదురైంది. 3 రోజుల్లోనే 100 ఎకరాల చెట్లు నరికివేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ధర్మాసనం ప్రశ్నించింది. అది కూడా సెలవు రోజులు చూసుకుని ఆ పని చేయడం వెనుక ప్రభుత్వ ఆంతర్యం ఏంటని కోర్టు నిలదీసింది. అటవీ ప్రాంతం(Forest Area)లో అభివృద్ధి పేరుతో చెట్లు కొట్టేసే ముందు సంబంధిత అధికార యంత్రాంగం వద్ద అనుమతి ఎందుకు తీసుకోలేదని ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది.
వారంతా జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి..
ప్రభుత్వాన్ని నిలదీయడంతో పాటు చెట్లు నరికిన 100 ఎకరాల్లో పూర్వస్థితిని ఎలా తీసుకొస్తారో చెప్పాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. లేదంటే తాత్కాలికంగా జైలు(Jail)కు వెళ్లేందుకు సంబంధిత అధికారులు సిద్ధంగా ఉండండాలని హెచ్చరించింది. మీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(Chief Secretary to the State Govt) జైలుకు వెళ్లకుండా కాపాడుకోవాలనుకుంటే 100 ఎకరాల్లో పూర్వ స్థితిని తీసుకొచ్చే ప్రణాళికతో రావాలని సుప్రీం స్పష్టం చేసింది. తదుపరి విచారణను మే 15వ తేదీకి వాయిదా వేసింది. జస్టిస్ బి.ఆర్. గవాయి, జస్టిస్ ఏ.జి. మసిలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. కాగా సుప్రీం తీర్పు కాంగ్రెస్ సర్కార్‌కి చెంపపెట్టు లాంటిదని విపక్షాలు అంటున్నాయి.