Mana Enadu : పుష్ప-2 సినిమా (Pushpa 2) బెనిఫిట్ షో సమయంలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా మరో బాలుడు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే పోలీసులు ఈ కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ను ఏ1గా పేర్కొంటూ అరెస్టు చేయగా ఆయన బెయిల్ పై విడుదలయ్యారు.
ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ సాక్షిగా కీలక ప్రకటన చేస్తూ టాలీవుడ్ (Tollywood) కు బిగ్ షాక్ ఇచ్చింది. ఇక నుంచి రాష్ట్రంలో సినిమా విడుదలకు ముందురోజు ఎలాంటి బెనిఫిట్ షో (No Benefit Shows in Telangana)లు ఉండవని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. అలాగే టికెట్ల రేట్ల పెంపునకు అనుమతి ఇచ్చేది లేదని స్పష్టం చేశారు.
మరోవైపు అల్లు అర్జున్.. రేవతి కుటుంబానికి పరిహారం ఇస్తామన్న మాట నిలబెట్టుకోలేదని మంత్రి కోమటిరెడ్డి (Minister Komatireddy News) మండిపడ్డారు. రేవతి కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని స్పష్టం చేశారు. ఆమె ఫ్యామిలీకి ప్రభుత్వం తరఫున రూ.25 లక్షల పరిహారం ఇస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. అదే విధంగా బాలుడి చికిత్సకు ప్రతీక్ ఫౌండేషన్ తరఫున సాయం చేస్తామని చెప్పారు. శ్రీతేజ్ వైద్య ఖర్చులనూ ప్రభుత్వమే చెల్లిస్తుందని వెల్లడించారు. ఇక సంధ్య థియేటర్ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన తర్వాత తెలంగాణ శాసనసభను స్పీకర్ నిరవధికంగా వాయిదా వేశారు.






