Mana Enadu : తెలంగాణలో సంక్రాంతి తర్వాత అర్హులకు కొత్త రేషన్ కార్డులు (New Ration Cards) జారీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆ దిశగా వడివడిగా చర్యలు చేపడుతోంది. పాత పద్ధతిలో కాకుండా అత్యాధునిక టెక్నాలజీతో కూడిన రేషన్ కార్డులను అర్హులకు ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే కొత్త రేషన్ కార్డుల కోసం సర్కార్ దరఖాస్తులను కూడా ఆహ్వానించింది.
ఎలక్ట్రానిక్ చిప్ తో రేషన్ కార్డు
రెండున్నరేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుల దరఖాస్తులను ఆహ్వానించి అర్హులకు కార్డులను జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం (Telangana Govt)కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు ప్రకటించి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ క్రమంలో వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత ఈ కార్డులు జారీ చేస్తానని ప్రకటించింది. ఇక కొత్త రేషన్ కార్డుల్లో ఎలక్ట్రానిక్ చిప్ (Electronic Chip)ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర సర్కార్ భావిస్తోంది. ఆ చిప్‌లో కుటుంబ సభ్యుల సంఖ్య, చిరునామా ఇతర సమాచారం ఉంటుందని చెప్పారు.
సంక్రాంతికి కొత్త కార్డులు
మరోవైపు సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు అందజేస్తామని శాసన మండలిలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) ఇప్పటికే చెప్పిన విషయం తెలిసిందే. దాదాపు కొత్తగా 36 లక్షల మందికి రేషన్ కార్డులను ఇవ్వాలని తెలిపారు. రేషన్ కార్డు దారులకు ఇప్పుడు ఇస్తున్న ఆరు కిలోల బియ్యంతోపాటు సన్నబియ్యం కూడా అందజేస్తామని వెల్లడించారు.






