తెలంగాణ సర్కార్ పురపాలికలు, కార్పొరేషన్ల (Corporations) విషయంలో త్వరలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఔటర్ వరకు కొత్తగా కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, స్థిరాస్తి రంగానికి ఊతమిచ్చేందుకు కొత్త కార్పొరేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈనెల 25వ తేదీతో శివారు కార్పొరేషన్లు, మున్సిపాలిటీ(Municipalities)ల్లో పాలక మండలి పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకోనుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఏ ప్రాతిపదికన ఏర్పాటు చేద్దాం
ఔటర్ (Outer Ring Road) వరకు ప్రణాళికా బద్ధమైన అభివృద్ధి జరగడం లేదని భావిస్తున్న ప్రభుత్వం.. తక్కువ విస్తీర్ణంతో మున్సిపాల్టీలు, మెగా కార్పొరేషన్ల ఏర్పాటును పరిశీలిస్తోంది. ఇలా మూడు లేదా నాలుగు కార్పొరేషన్లు ఏర్పాటు చేసే అవకాశముందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఔటర్ ఆవల ఉన్న నార్సింగ్, శంషాబాద్లోని పలు ప్రాంతాలు కూడా మెగా కార్పొరేషన్ల పరిధిలో ఉండే అవకాశముందని సమాచారం. జిల్లాల పరిధిని పరిగణనలోకి తీసుకుని కార్పొరేషన్ గా ఏర్పాటు చేయాలా? ఇతర అంశాల ప్రాతిపదికన చేయాలా అన్న విషయం పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
అప్పటిలోగా ప్రత్యేకాధికారుల పాలనే
మరోవైపు పార్లమెంట్ (Parliament), అసెంబ్లీ నియోజకవర్గాలు ఒకే కార్పొరేషన్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకోనున్నట్లు.. అలాగే.. ప్రాంతాల వారీగా ఆర్థిక, సామాజిక అంశాలనూ పరిగణనలోకి తీసుకోనున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. జీహెచ్ఎంసీ పాలకమండలి గడువు వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 వరకు ఉండటంతో ఆ తర్వాతే కొత్త కార్పొరేషన్ల ఏర్పాటుకు అడుగులు పడే అవకాశముందని ఓ అధికారి తెలిపారు. ఆలోపు కసరత్తు పూర్తి చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఇక ఈ శనివారంతో మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో పాలకమండలి గడువు ముగియనుండటంతో ప్రత్యేక అధికారుల పాలన తీసుకురాబోతున్నట్లు సమాచారం.







