భూమాతగా మారుతున్న ధరణి .. పోర్టల్ ఏర్పాటుపై మంత్రి పొంగులేటి స్పెషల్ ఫోకస్

Mana Enadu : ధరణి స్థానంలో (Dharani Portal) ‘భూమాత’ పోర్టల్‌ను ప్రవేశ పెట్టి భూ హక్కులు కోల్పోయిన రైతులకు న్యాయం చేస్తాం. ‘ల్యాండ్ కమిషన్‌’ ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరిస్తాం. గతంలో పేదలకు పంపిణీ చేసిన 25 లక్షల ఎకరాలపై పూర్తిస్థాయి భూ హక్కులను కల్పిస్తాం. శాసనసభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఇవి. ఆరు గ్యారంటీలతో పాటు ఈ హామీలు కూడా ఇచ్చిన ఆ పార్టీ అధికారంలోకి రాగానే గ్యారంటీలతో పాటు వీటి అమలుపైనా ప్రత్యేక దృష్టి సారించింది.

ముఖ్యంగా రెవెన్యూ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ (Ponguleti Srinivas Reddy) భూ సమస్యలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ధరణి పోర్టల్ ను భూమాతగా మార్చేందుకు ఆయన తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ ఈ ప్రక్రియలో వేగాన్ని తీసుకొస్తున్నారు. వీలైనంత త్వరగా భూమాత పోర్టల్(Bhoomatha Portal) ను అందుబాటులోకి తీసుకువచ్చి ప్రజలకు ఇబ్బందులు తొలగించాలని యోచిస్తున్నారు. 

ధరణి స్థానంలో భూమాత

గత కేసీఆర్ సర్కార్.. వ్యవసాయ, వ్యవసాయేతర భూములకు హక్కులు కల్పించేలా ధరణి పోర్టల్‌ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. భూముల రిజిస్ట్రేషన్లు(Registrations), మ్యూటేషన్లు, ఆస్తుల బదిలీలు సహా పారదర్శకత, జవాబుదారీతనంతో సేవలందించాలనేది ఈ పోర్టల్‌ ఉద్దేశమైనా..  నిర్వహణలో అనేక లోపాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం ఫిర్యాదులను పరిష్కరించకపోవడంతో అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎన్నికల్లో ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీ(BRS Party)కి ఇది మైనస్ పాయింట్.. దీన్ని ప్రశ్నిస్తూ.. ధరణి స్థానంలో భూమాత తీసుకొస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఇది ప్లస్ అయ్యింది.

అధికారులతో మంత్రి పొంగులేటి సమీక్షలు

ఇక ఈ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి.. ధరణి స్థానంలో భూమాత పోర్టల్‌ తీసుకొచ్చి సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చాక ఆ దిశగా అడుగులేసింది. భూసమస్యల(Land Issues) అధ్యయనానికి ధరణి పేరిట కమిటీ వేసి.. పోర్టల్ లో లోపాలు గుర్తించి రాష్ట్ర ప్రభుత్వానికి సవరణలు, సలహాలు చేసింది. ఇక మంత్రి పొంగులేటి కమిటీతో ఎప్పటికప్పుడు సమావేశమవుతూ ధరణి లోపాలపై సమాలోచనలు చేస్తూ.. భూమాత పోర్టల్ ఎలా ఉంటే ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉంటుందని కమిటీతో పాటు ఇతర ఉన్నతాధికారులు, నిపుణులతో చర్చలు జరుపుతున్నారు.

అధికార వికేంద్రీకరణపై ఫోకస్

ఇక భూమాత పోర్టల్ ను అమల్లోకి తీసుకువచ్చి అధికార వికేంద్రీకరణ చేయాలనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు మంత్రి పొంగులేటి గతంలో చెప్పారు. ఆర్​ఓఆర్​ చట్టం(ROR Act) ప్రకారం జిల్లా కలెక్టర్ల అధీనంలో ఉన్న అధికారాల్లో కొన్నింటిని తహసీల్దార్లు, ఆర్డీవోలకు బదలాయిస్తే కలెక్టర్లపై పని ఒత్తిడి తగ్గుతుందని, సమస్యల పరిష్కారంలో వేగమూ పెరుగుతుందని భావిస్తోంది. ఇక ధరణి స్థానంతో తీసుకొచ్చే భూమాత పోర్టల్‌ ఇప్పుడున్న సమస్యల్ని పరిష్కరించడంతో పాటు కొత్త సమస్యలు రాకుండా ఉండాలని ప్రభుత్వం యోచిస్తోంది. 

భూ వివాదాల పరిష్కారం కోసం రెవెన్యూ ట్రైబ్యునల్

అయితే ధరణితోపాటు భూ వ్యవస్థలను సమగ్రంగా ప్రక్షాళన చేయాలని భావిస్తున్న ప్రభుత్వం.. ఇప్పుడున్న ఆర్వోఆర్ ​చట్టాన్ని సవరించే బదులు భూములకు సంబంధించిన చట్టాలన్నీ కలిపి సమగ్రంగా ప్రత్యేక చట్టం చేయాలని నిర్ణయించింది.  భూమాత పోర్టల్‌లో ఇప్పుడున్న మాడ్యూళ్ల సంఖ్యని వీలైనంత వరకు తగ్గించి సామాన్యులకు సులభంగా అర్థమయ్యేలా తీర్చిదిద్దుతున్నారు. ఇందుకోసం మంత్రి పొంగులేటి నిత్యం అధికారులతో సమావేశమవుతూ ఎప్పటికప్పుడు పోర్టల్ అప్డేట్స్ పై ఆరా తీస్తున్నారు. భూ వివాదాల పరిష్కారం కోసం రెవెన్యూ ట్రైబ్యునల్‌(Revenu Tribunal)లను ఏర్పాటు చేయాలని, భూమికి సంబంధించిన ముఖ్యమైన చట్టాలను కలిపి ఒకే చట్టంగా రూపొందించాలనుకుంటున్నట్లు తెలిపారు.

Share post:

లేటెస్ట్