మేడారం మహజాతరలో భక్తులకు ఇబ్బందులు కల్గించొద్దు!

మన ఈనాడు: మేడారం మహజాతర 2024 సందర్భంగా మంత్రి సీతక్క, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి డా.ఎ. శరత్, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శబరిష్ తో కలిసి హరిత హోటల్ లో అధికారుల తో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.జాతరలో భక్తులకు సౌకర్యాలు కల్పించడంతోపాటు అసౌకర్యాలు కల్గించొద్దని మంత్రి అధికారులకు సూచించారు.
మేడారం జాతరకు వివిధ సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని, ముఖ్యంగా జంపన్న వాగు పరిసర ప్రాంతాల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, ప్రమాద స్థలాలను ముందుగానే గుర్తించి హెచ్చరిక బోర్డ్ లను ఏర్పాటు చేయాలని అన్నారు.

పారిశుద్ధ్యం, తాగునీటి పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. స్టాళ్ళ వద్ద డస్ట్ బిన్ లు ఏర్పాటు చేయాలని, పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలు ప్రపంచానికి తెలిసే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. పార్కింగ్ స్థలాల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సైన్ బోర్డులు, ఫ్లడ్ లైట్లు, త్రాగునీరు, టాయిలెట్ తదితర అన్ని చర్యలు చేపట్టాలన్నారు. క్షౌరశాలలో క్షురకులు భక్తుల నుండి అధిక మొత్తం వసూలు చేయకుండా ఒకే మొత్తంను నిర్ణయించాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ నిరంతరం కొనసాగాలన్నారు. భక్తులకు చేపడుతున్న సౌకర్యాల కల్పనలో రాజీ పడవద్దని, ప్రతి అంశంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అన్నారు. అనంతరం గిరిజన సoక్షేమ శాఖ కార్యదర్శి డా. ఎ. శరత్ మాట్లాడుతూ మేడారం జాతర లో జంపన్న వాగు , చిలకల గుట్ట, అమ్మవార్ల గద్దెల వద్ద విధులు నిర్వర్తించే సిబ్బంది నిత్యం అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

జాతర విధులు నిర్వర్తించే సిబ్బంది ఎవరికి కేటాయించిన స్థానాలలో మాత్రమే విధులు నిర్వహించేలా సెక్టోరల్ , జోనల్ అధికారులు చూడాలని భక్తులు అమ్మవార్లను దర్శించుకునే సమయం లో ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా చూడాలని అన్నారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని, ఉద్దేశ్యంతో తోనే ప్రభుత్వం 105 కోట్ల రూపాయల నిధులు కేటాయించిందని తెలిపారు. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి శ్రీజ, ఏటూరు నాగారం అదనపు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, జిల్లా అటవీ అధికారి రాహుల్ కిషన్ జాదవ్, ఆర్డీఓ సత్యపాల్ రెడ్డి, దేవాదాయ శాఖ అధికారి రాజేందర్, ఇంజనీరింగ్ అధికారులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share post:

లేటెస్ట్