మన ఈనాడు:కాంగ్రెస్.. దాదాపు తొంబై ఏళ్ల రాజకీయ ప్రస్థానం. 361 స్థానాలతో తొలి లోక్‌సభ గెలుపుతో పాటు, దాదాపు పదిసార్లు ప్రధాని పీఠాన్ని దక్కించుకున్న అచంచల చరిత్ర. ఇప్పటి పరిస్థితుల్లో ఏ పార్టీ అందుకోలేని మైలు రాళ్లెన్నో దాటొచ్చింది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. కానీ ఇప్పుడు..? 2014 ఎన్నికల్లో 44 స్థానాలు, 2019 ఎన్నికల్లో 52 స్థానాలకు దిగబడి.. ప్రాంతీయ పార్టీల మద్దతు కోరుతూ ప్రతిపక్షంలో కాలం నెట్టుకొచ్చే పరిస్థితి. రోజురోజుకీ మోదీ ఛరిష్మాతో పాటు కమలం పార్టీ ప్రాబల్యమూ పెరుగుతూ వస్తుంటే.. కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గుతూ వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో జాతీయ కాంగ్రెస్‌కు సంజీవనిగా మారింది తెలంగాణ కాంగ్రెస్.
రాహుల్ జోడో యాత్రతో ఊపు మీదున్న పార్టీ శ్రేణులకు తెలంగాణ రాష్ట్రంలో గెలుపు అంతులేని శక్తినిచ్చింది. ఇటు తెలంగాణకు కర్ణాటక తోడై దక్షిణ భారతదేశంలో భాజపాను నిలబడనీయకుండా చేస్తోంది. ఇదే ఇప్పుడు సర్వేలూ చెబుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా 70 నుంచి 80 స్థానాలు కాంగ్రెస్ గెలవబోతుండగా.. అందులో 10కి పైగా స్థానాలు తెలంగాణా నుంచే రానున్నాయనేది రాజకీయ నిపుణుల అంచనా. ఇదే జరిగితే దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ను నిలబెట్టేది తెలంగాణే అవుతుంది. అధికారం దక్కకపోయినా.. ప్రతిపక్షంగా అయినా పోరాడే హక్కునివ్వబోతున్నదీ తెలంగాణే.
అసలు గెలుస్తుందో లేదోనన్న అంచనాల నడుమ పార్టీని అన్నీ తానై నడిపించి.. గెలుపు తీరాలకు చేర్చిన ఘనత కచ్చితంగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నది వాస్తవం. ఈ విషయం తెలిసే కేంద్ర నాయకత్వం సైతం రేవంత్ వెంట నిలబడింది. ఆ నమ్మకం నిలబెట్టుకుంటూనే రాష్ట్ర ప్రజల మన్నన పొందుతున్న రేవంత్ సర్కారు.. ప్రజా ప్రభుత్వాన్ని విజయ తీరాలకు చేర్చే పనిలో పడ్డారు. ఎంపీ ఎన్నికల్లో సైతం ప్రతిపక్ష భారాస 3 స్థానాలకు, ఎన్నో ఆశలతో దిగుతున్న భాజపా 3 స్థానాలకే పరిమితం అవుతాయని సర్వేలు చెబుతుండగా.. అన్ని స్థానాల్లో హస్తం హవా కొనసాగుతుందని తెలుస్తోంది.