CM Revanth Reddy| నిర్బంధాలు వద్దు.. చర్చతోనే సమస్యలకు పరిష్కారం!

Mana Enadu:ఉద్యోగ సంఘాలతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది కేంద్రంలో సమావేశమయ్యారు.

ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, ప్రొఫెసర్ కోదండరామ్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, వివిధ ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీజీవో, టీఎన్‌జీవో, పంచాయితీరాజ్, రెవెన్యూ, విద్యుత్ సంఘాల నేతలు తమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఉపాధ్యాయులకు సంబంధించిన మల్టి జోన్, స్పౌస్ సమస్యలు, ట్రాన్స్‌ఫర్స్, స్థానికత, పెండింగ్ డీఏ తదితర సమస్యలను సీఎంకు విన్నవించారు. వీటిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు.

పదేళ్లుగా ఉద్యోగుల సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం రాలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వారి ఆవేదన వినేవారు లేక అనేక ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. కేబినెట్‌లో చర్చించి పాఠశాలలకు, విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ అందిస్తామని హామి ఇచ్చారు. సమస్యలకు పరిష్కారం చర్చలేనని, నిర్బంధాలు కావని తేల్చి చెప్పారు.

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఇప్పటికే మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో కిందిస్థాయి సిబ్బందిని నియమిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏ ఒక్కరి వల్లో రాలేదని విద్యార్థి, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల పోరాటంతోనే తెలంగాణ రాష్ట్రం సిద్దించిందని సీఎం అన్నారు.

మూడు నెలల్లోపే 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 11 వేల పైచిలుకు ఉద్యోగాలతో మెగా డీఎస్పీ నోటిఫికేషన్ జారీ చేశామన్నారు. మొదటి తారీఖున జీతాలు వేసి కుడా ప్రచారం చేసుకోలేదని అన్నారు. ఉద్యోగ సంఘాలపే కక్ష గట్టి కేసీఆర్ సంఘాలను రద్దు చేస్తే ప్రజలు కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేశారని పేర్కొన్నారు.

Share post:

లేటెస్ట్