Kejriwal: అరెస్ట్, ఈడీ కస్టడీపై హైకోర్టులో తీర్పు రిజర్వ్

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు జరిగాయి. అరెస్ట్, ఈడీ కస్టడీని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ వేశారు.

దాదాపు మూడు గంటల పాటు సుదీర్ఘంగా ఇరు పక్షాలు న్యాయస్థానంలో వాదనలు వినిపించారు. అనంతరం తీర్పును ధర్మాసనం గురువారానికి రిజర్వ్ చేసింది.

మార్చి 21న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచగా రెండు సార్లు ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది. అనంతరం ఏప్రిల్ 1న తిరిగి హాజరుపరచగా ఏప్రిల్ 15 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆయన్ను తీహార్ జైలుకు తరలించారు. అరెస్టు, ఈడీ రిమాండ్‌ను సవాల్ చేస్తూ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

హైకోర్టులో ఈడీ తరఫున ఏఎస్‌జీ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. కేజ్రీవాల్.. డిజిటల్ ఆధారాలను ధ్వంసం చేశారని ఈడీ తరపు న్యాయవాది వెల్లడించారు. లిక్కర్ కేసులో డబ్బుకు సంబంధించిన వ్యవహారాన్ని కూడా గుర్తించినట్లు తెలిపారు. హవాలా ద్వారా వందల కోట్లు ఆప్ పార్టీకి అందాయని… ఆ డబ్బంతా గోవా ఎన్నికల్లో ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ అన్ని నిర్ణయాలు ఆయనే తీసుకుంటారని.. వ్యవహారాలన్నింటికీ ఆయనే బాధ్యత వహిస్తారన్నారు. ఇండో స్పిరిట్ బ్లాక్ లిస్ట్ దానికి హోల్ సేలర్ లైసెన్స్ ఎలా ఇచ్చారని.. హోల్ సేల్ దుకాణాలకు 5 శాతం ఉన్న లాభాలను 12 శాతానికి పెంచి.. పెరిగిన 7 శాతం లాభాలను ముడుపుల రూపంలో ఆప్ తీసుకుందని ఈడీ లాయర్ చెప్పుకొచ్చారు. ఆప్ మీడియా ఇంఛార్జ్ విజయ్ నాయర్ లిక్కర్ కేసులో కీలక పాత్ర పోషించారని.. ఆధారాలు దొరకకుండా చేసేందుకు కోట్ల రూపాయల ఫోన్లను ధ్వంసం చేశారన్నారు. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కేజ్రీవాల్ ప్రత్యక్షంగా ఉన్నారని ఈడీ వాదనలు వినిపించింది.

కేజ్రీవాల్‌ను ఉద్దేశ్వపూర్వకంగానే ఈడీ అధికారులు అరెస్ట్ చేశారని కేజ్రీవాల్ తరపున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. కేజ్రీవాల్ అరెస్ట్‌తో ఆప్‌ను బలహీనపర్చేందుకే అధికారులు ఈ చర్యకు పాల్పడ్డారని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని దెబ్బకొట్టేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలకు పాల్పడిందని అభిషేక్ స్పష్టం చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును గురువారం మధ్యాహ్నానికి ఢిల్లీ హైకోర్టు రిజర్వ్ చేసింది.

Share post:

లేటెస్ట్