Teenmaar Mallanna: పట్టభద్రుల ఎమ్మెల్సీగా మల్లన్న..

Mana Enadu:ఎమ్మెల్సీ పట్టభద్రుల స్థానానికి జరిగిన ఉప ఎన్నికలోనూ బీఆర్‌ఎ్‌సకు భంగపాటు తప్పలేదు. సిటింగ్‌ ఎమ్మెల్సీ స్థానాన్ని సైతం ఆ పార్టీ నిలబెట్టుకోలేకపోయింది.

ఎమ్మెల్సీ పట్టభద్రుల స్థానానికి జరిగిన ఉప ఎన్నికలోనూ బీఆర్‌ఎ్‌సకు భంగపాటు తప్పలేదు. సిటింగ్‌ ఎమ్మెల్సీ స్థానాన్ని సైతం ఆ పార్టీ నిలబెట్టుకోలేకపోయింది. శానసమండలి నల్లగొండ- ఖమ్మం- వరంగల్‌ పట్టభద్రుల నియోజకవర్గ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌కుమార్‌ విజయం సాధించారు. ద్వితీయ ప్రాధాన్య ఓట్ల లెక్కింపు అనంతరం కూడా ప్రధాన ప్రత్యర్థి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఏనుగు రాకేశ్‌రెడ్డి కంటే భారీ ఆధిక్యంలో ఉండడంతో మల్లన్నను విజేతగా ప్రకటించారు. స్వతంత్ర అభ్యర్థులతోపాటు బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డి ఎలిమినేషన్‌ తర్వాత కూడా మల్లన్న దాదాపు 18 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కానీ, కోటా ఓటు లభించకపోవడంతో ఈసీ ఉన్నతాధికారుల అనుమతి తీసుకున్న తర్వాత ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి హరిచందన.. మల్లన్నను విజేతగా ప్రకటించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి.. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ తరపున జనగామ ఎమ్మెల్యేగా గెలవడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.

మూడో ప్రయత్నంలో ఎమ్మెల్సీగా ఎన్నిక

జర్నలిస్టుగా, ప్రశ్నించే గొంతుకగా చిరపరిచితుడైన తీన్మార్‌ మల్లన్న ఎట్టకేలకు మూడో ప్రయత్నంలో ఎమ్మెల్సీగా విజయం సాధించారు. 2015లో మొదటిసారి కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఆయన బరిలో నిలి చి ఓటమిపాలయ్యారు. ఆతర్వాత 2021లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి బీఆర్‌ఎ్‌సకు బలమైన పోటీ ఇచ్చారు. మూడో ప్రయత్నంలో ఇప్పుడు కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో ఉండి విజయం సాధించారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతో నేరుగా కొట్లాడిన క్రమంలో మల్లన్నపై 59వరకు కేసులు నమోదయ్యాయి.


ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు : మల్లన్న విజయం ఖాయం కావడంతో రాత్రి పది గంటల సమయంలో కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లన్న కౌంటింగ్‌ హాల్‌ బయటకు వచ్చి విజయసంకేతం చూపారు. ద్వితీయ ప్రాధాన్య ఓట్ల లెక్కింపు తర్వాత కూడా తాను 18వేల పైచిలుకు మెజార్టీతో ఉన్నానని, లాంఛనాలు పూర్తయ్యాక అధికారికంగా ప్రకటిస్తారని వెల్లడించారు. తన గెలుపునకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రకటన రాకముందే ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌ శ్రేణులు సంబరాలు జరుపుకోగా, సోషల్‌మీడియాలో శుభాకాంక్షల వెల్లువ కొనసాగింది.

Share post:

లేటెస్ట్